చీర చోరులెవరు?

– దుర్గగుడిలో చీర మాయంపై సందిగ్ధత

– చీర మాయంపై ఉన్నతాధికారులు సీరియస్‌

విజయవాడ, ఆగస్టు6(జ‌నం సాక్షి ) : విజయవాడ దుర్గగుడిలో అమ్మవారికి సారె రూపంలో వచ్చిన చీర మాయమైన ఘటనలో సందిగ్ధత కొనసాగుతోంది. ఘటనపై విచారణ విషయంలో పోలీసులు, దుర్గగుడి అధికారులు సాకులతో సరిపెడుతున్నారు. భక్తులు చీర తెచ్చినట్లు రికార్డుల్లో నమోదు కానందున పోలీసులకు ఫిర్యాదు చేయలేమని దుర్గగుడి అధికారులు అంటున్నారు. అదే సమయంలో తమకు భక్తుల నుంచి గానీ, అధికారుల నుంచి గానీ ఫిర్యాదు రానందున కేసు నమోదు చేయలేదని పోలీసులు చెబుతున్నారు. విషయం తెలిసిన వెంటనే దుర్గగుడికి వచ్చిన పోలీసులు.. భక్తులు, అర్చకులు, పాలకమండలి సభ్యులను విచారించారు. ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ టీవీ దృశ్యాలను పరిశీలించారు. ఆ తర్వాత మాత్రం చర్యలకు మాత్రం వెనుకంజ వేస్తున్నారు. నిబంధనల మేరకు ఫిర్యాదు వస్తేనే కేసు నమోదు చేస్తామని చెబుతున్నారు. అయితే అమ్మవారికి ఆచీర సమర్పించిన భక్తులు సూర్యనారాయణ, వసుంధర మాత్రం పాలకమండలి సభ్యుడు పెంచలయ్య విజ్ఞప్తి మేరకే తాము పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలిపారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన ఘటనపై ఉన్నతాధికారులకు చెప్పినా పట్టించుకోకపోవటంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై నేడు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

 

తాజావార్తలు