చెత్త ఏరుకునే ఆవిడ కూతురు అందాలపోటీలో విజేత
నెత్తిపై ధగధగలాడే వజ్రాల కిరీటం, భుజాల మీదుగా నడుముకు సిల్కు పట్టా… అందానికే ఈర్ష్య పుట్టేంత అందం. ఆమె పేరే కనిత్తా మింట్ ఫాసేంజ్. మిస్ అన్ సెన్సార్డ్ న్యూస్ థాయ్ లాండ్-2015 అందాల పోటీల్లో విజేత. ఆలాంటి అందగత్తె రోడ్డుపై చెత్త ఏరుకునే ఓ మహిళ కాళ్లు మొక్కింది. ఈ సంఘటనను చూసిన ఓ ఫోటోగ్రాఫర్ షాక్ కు గురయ్యాడు. అందాల పోటీల విజేత చెత్త ఏరుకునే ఆవిడ కాళ్లు మొక్కటమేమిటి అనుకున్నాడు. కానీ, ఆ చెత్త ఏరుకునే ఆవిడే… అందాల పోటీలో టైటిల్ గెలుచున్న ఫాసేంజ్ తల్లి అని తెలిసి మరింత ఆశ్చర్యపోయాడు.
అందాల పోటీల్లో పాల్గొన్న ఫాసేంజ్ నిరుపేద కుటుంబానికి చెందిన యువతి. చిన్ననాటి నుంచి ఫాసేంజ్ తల్లి చెత్త ఏరుకుంటూనే కుటుంబాన్ని పోషించారు. కూతురు ఇష్టం ప్రకారం.. తాను సంపాదించిన సొమ్మంతా అందాల పోటీల్లో పాల్గొనేందుకు తన కూతురు కోసం ఖర్చు చేశారు. ఎంతో కష్టపడి అందాల పోటీలో నెగ్గిన ఫాసేంజ్ తన తల్లిని మర్చిపోలేదు. ఫాసేంజ్ ఎంత అందమైన వ్యక్తో అంత సంస్కారం, హుందాతనం కలిగిన వ్యక్తిత్వం ఆమె సొంతం. అందాల పోటీలో నెగ్గిన వెంటనే ఆనందంతో తన తల్లి కాళ్లను మొక్కారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ ఫోటో హల్‌చల్ చేస్తోంది.
పేద, మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చినవాళ్లు చాలామంది సినిమాల్లోనో, టీవీల్లోనో ఏ చిన్న అవకాశం వచ్చినా తమ వారిని దగ్గరికి రానివ్వకపోవడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ, ఫాసేంజ్ మాత్రం తన నేపథ్యాన్ని, తన తల్లిని తక్కువ చేసి చూడలేదు. చేస్తున్న వృత్తి పట్ల తన తల్లికిగాని, తనకుగానీ ఏనాడు చులకన భావం కలగలేదని ఫాసేంజ్ చెప్పారు. కుటుంబ పరిస్థితుల కారణంగా పై చదువులకు నోచుకోకపోయినా… అందాల పోటీల్లో ఆసక్తి ఉండటంతో ఇందులో పాల్గొన్నారు. ఐతే, అందాల పోటీకి ముందు సైతం తల్లితో కలిసి ఫాసేంజ్ వీధి వీధి తిరుగుతూ చెత్త సేకరించారు. అందాల పోటీల్లో గెలవటంతో ఫాసేంజ్ కు పలు సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. దీంతో ఇక తన తల్లిని సంతోషంగా చూసుకుంటానని ఫాసేంజ్ చెప్పారు.