చెత్త వేస్తే కఠిన చర్యలు : కమిషనర్‌

కరీంనగర్‌ ,నవంబర్‌ 21: ఇళ్ల మధ్య ఖాళీగా ఉన్న స్థలాల్లో, మురికికాలువల్లో చెత్త వేయరాదని.. వేస్తే ఇంటి యజమానులకు నోటీసులు జారీ చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ ఆబిద్‌ హుస్సేన్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులను ఆదేశించారు. ప్రజలు కూడా పారిశుధ్య నిర్వహణలో సహకరించాలన్నారు. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసి , ఎత్తేయడం అధికారుల బాధ్యత అన్న విధంగా ప్రవర్తించవద్దని సూచించారు. నిరల్‌క్ష్యంగా చెత్తవేసిన వారికి జరిమానా విధించే ఆలోచన చేస్తున్నామన్నారు. 34వ డివిజన్‌లో రాజీవ్‌ గాంధీపార్కును  ప్రజలకు ఉపయోగపడేలా ఇరుపక్కల ఉన్న గేట్లను తెరిచి ఉంచాలని, పార్కు చుట్టు-పక్కల పారిశుధ్యం సక్రమంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. తెల్లవారుజామునే వార్డులలో తిరిగి పారిశుధ్య నిర్వహణ పనులను పర్యవేక్షించాలంటూ చేసిన హెచ్చరికల నేపథ్యంలో నగరంలో ప్రత్యేక పనులు కొనసాగుతున్నాయి. రోజుకో డివిజన్‌ను లాటరీ పద్ధతిన ఎంపిక చేసి ఉదయమే ఆ డివిజన్‌లో కమిషనర్‌ ఇతర అధికారులతో కలిసి పారిశుధ్య నిర్వహణ పనులను పరిశీలిస్తున్నారు.  పారిశుధ్యం, నీటి సరఫరా, వీధి దీపాలు తదితర వాటికి సంబంధించి ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. డివిజన్‌ పరిసరాల్లో కలియతిరిగి మురికికాలువల్లో ఉన్న చెత్తను, సిల్ట్‌ను తొలగించడం లేదని, భవన నిర్మాణాల వేస్టేజీని రోడ్లపై కుప్పలుగా వేసి రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తున్న వాటిని వెంటనే తొలగించాలని ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో  నిర్వహించిన డయల్‌ యువర్‌ కమిషనర్‌కు ఐదు ఫిర్యాదులు రాగా ప్రజావాణికి 13 ఫిర్యాదులు వచ్చాయి. ఆయా సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ ఇన్‌చార్జి కమిషనర్‌ ఆబిద్‌ హుస్సేన్‌ అధికారులను ఆదేశించారు.