చెన్నై మేయర్ తొలిసారి దళిత మహిళ
29 ఏండ్ల ఆర్ ప్రియ మేయర్‌గా ప్రమాణ స్వీకారం
చెన్నై,మార్చి4 (జనం సాక్షి ) : తొలిసారి ఓ దళిత మహిళ చెన్నై నగరపాలక సంస్థ మేయర్‌గా ఎంపికయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన అధికార పార్టీ డీఎంకేకి చెందిన 29 ఏండ్ల ఆర్ ప్రియ మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో మేయర్ అయిన తొలి దళిత మహిళగా, అతి పిన్నయస్కురాలిగా ఆమె రికార్డుల్లోకెక్కారు. మొత్తంగా చెన్నై మేయర్ అయిన మూడో మహిళగా నిలిచారు. అంతకుమందు తారా చెరియన్ , కామాక్షి జయరామన్ చైన్నై మేయర్లుగా పనిచేశారు.ఈ ఏడాది జనవరిలో జరిగిన చెన్నై కార్పొరేషన్ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా గెలుపొందిన యువ అభ్యర్థులలో ప్రియ ఒకరు. వారిలో డీఎంకే మిత్రపక్షమైన సీపీఎంకి చెందిన 21 ఏండ్ల ప్రియదర్శిని పిన్న వయస్కురాలు. తీనాంపేట 98వ వార్డు నుంచి ప్రియదర్శిని గెలుపొందారు. కాగా, 74వ వార్డు అయిన తిరు వీ కా నగర్ నుంచి గెలుపొందిన ప్రియా.. ఉత్తర చెన్నై నుంచి ఎంపికైన మొదటి మేయర్‌గా కూడా రికార్డ్ సృష్టించారు. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జీసీసీ)లో 200 వార్డులు ఉండగా.. డీఎంకే 153 స్థానాల్లో విజయం సాధించింది. అన్నాడీఎంకే 15, కాంగ్రెస్ 13, ఇండిపెండెట్లు 5, సీపీఎం 4, వీసీకే 4, బీజేపీ 1 స్థానం చొప్పున గెలుపొందాయి.