చెరకు రైతుల సమస్యలు తీర్చాలి
విశాఖపట్టణం,సెప్టెంబర్4(జనం సాక్షి): చోడవరం సుగర్ ఫ్యాక్టరీ దక్షిణాదిలోనే అగ్రగామిగా ఉన్నా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు, పాలకవర్గం అవినీతి, అసమర్థత తోడై ఆర్థికంగా నష్టాల్లోకి చేరిందని చెరకు రైతుల సంఘం నేతలు పేర్కొన్నారు. నష్టాలు చూపుతూ రైతులకు బకాయిలు చెల్లించడం లేదన్నారు. ఎంఎల్‌ఎలు, ఎంపిలు ప్రతి యేటా వారి వేతనాలు, అలవెన్సులు పెంచుకునేందుకు తాపత్రయం పడున్నారే తప్ప రైతులకు గిట్టుబాటుధర కల్పించేందుకు కృషి చేయలేదనివిమర్శించారు.సహకార ఫ్యాక్టరీలను పరిరక్షించుకోవడానికి రైతులు నడుం బిగించాలని అన్నారు. రైతులు, కార్మికుల కష్టంతో ఈ ఫ్యాక్టరీ అనేక అవార్డులు సొంతం చేసుకుందన్నారు. జిల్లాలో చెరకు సాగుకు పెట్టుబడులు అధికమవుతున్న నేపథ్యంలో రైతులు ఈ పంటకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టన్నుకు రూ.2500 చొప్పున ఇచ్చి తీరుతామని పాలకవర్గం ఇచ్చిన హావిూ అమలు కాలేదన్నారు. వెంటనే బకాయిల చెల్లింపునకు చర్యలు తీసుకోవాలన్నారు.