చెలరేగిన రోహిత్: ఆసీస్ కు భారీ లక్ష్యం

12పెర్త్: ఆస్ట్రేలియాతో ఇక్కడ మంగళవారం జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా 310 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. రోహిత్ శర్మ,  విరాట్ కోహ్లిలు ఆసీస్ బౌలింగ్ కు పరీక్షగా నిలిచి టీమిండియా భారీ స్కోరు చేయడంలో సహకరించారు. రోహిత్ శర్మ(171 నాటౌట్; 163 బంతుల్లో 13 ఫోర్లు, 7 సిక్సర్లు) చెలరేగిపోయి ఆసీస్ బౌలర్లను ఊచకోత కోయగా,  విరాట్ కోహ్లి(91;97బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకుని తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. టాస్ గెలిచిన టీమిండియా ఆదిలోనే శిఖర్ ధవన్(9)ను తొలి వికెట్ రూపంలో కోల్పోయింది. అయితే ఆ ఆనందం ఆసీస్ శిబిరంలో ఎంతో సేపు నిలవలేదు. రోహిత్-కోహ్లిల ద్వయం ఆసీస్ బౌలింగ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ సుదీర్ఘంగా క్రీజ్ లో నిలిచారు. దాదాపు మూడు గంటల పాటు క్రీజ్ లో నిలుచుని రెండో వికెట్ కు 207 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో టీమిండియా పటిష్టస్థితికి చేరింది. అయితే జట్టు స్కోరు 243 వద్ద  ఫాల్కనర్ బౌలింగ్ లో షాట్ కు యత్నించిన విరాట్ అవుటయ్యాడు. అనంతరం రోహిత్ కు జత కలిసిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్కోరును ముందుకు తీసుకువెళ్లే క్రమంలో పెవిలియన్ చేరాడు. ధోని 13 బంతుల్లో 1 ఫోర్, 1సిక్స్ సాయంతో 18 పరుగులు చేసి మూడో వికెట్ గా అవుటయ్యాడు. చివరి ఓవర్ లో రవీంద్ర జడేజా(10) సాయంతో  14 పరుగులు రావడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో ఫాల్కనర్ కు రెండు వికెట్లు లభించగా, హజిల్ వుడ్ కు ఒక వికెట్ దక్కింది.
ఆస్ట్రేలియా గడ్డపై అజేయుడు…!

హైదరాబాద్‌: పెర్త్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్‌ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ రోహిత్‌ శర్మ అజేయ శతకంతో చెలరేగాడు. ఆసీస్‌ పేసర్‌ హేజిల్‌వుడ్‌ వేసిన తొలి ఓవర్‌ రెండో బంతినే బౌండరీకి పంపిన రోహిత్‌ ఆస్ట్రేలియాకు గట్టి హెచ్చరికలు పంపాడు. అరంగేట్రం బౌలర్‌ జోయల్‌ పారిస్‌కు చుక్కలు చూపించాడు. జోయల్‌ వేసిన ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్‌లోనే రోహిత్‌ కళ్లు చెదిరే సిక్స్‌ బాది బెదరగొట్టాడు. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(9) జట్టు స్కోరు 36 పరుగుల వద్దే ఔటైనా.. వన్‌డౌన్‌లోవచ్చిన విరాట్‌ కోహ్లి(91)తో కలిసి రెండో వికెట్‌కు ఏకంగా 207 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌కు భారీ స్కోరు అందించాడు. ఈ క్రమంలోనే 163 బంతుల్లో (171 నాటౌట్‌, 13×4, 7×6) వన్డే కెరీర్‌లో తొమ్మిదో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌.. రోహిత్‌ దూకుడును అడ్డుకునేందుకు బౌలర్లందరినీ ప్రయోగించినా నిరాశే ఎదురైంది. ఈ క్రమంలో 171 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన రోహిత్‌… ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక స్కోరు సాధించిన పర్యాటక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 1979లో వీవీ రిచర్డ్స్‌ పేరిట ఉన్న 153 పరుగుల రికార్డును రోహిత్‌ తిరగరాశాడు.