చైనాను కవ్వింపు చర్యలు కనిపెడుతూనే ఉండాలి

అడపాదడపా హెచ్చరికలతో అప్రమత్తత అవసరం
పాక్‌ తరహా దాడులకు చైనా కుట్రలు
న్యూఢల్లీి,ఏప్రిల్‌13(జ‌నంసాక్షి): చైనా అడపాదడపా అరుణాచల్‌ తదితర సరిహద్దుల్లో అలజడి సృష్టిస్తోంది.
భారత్‌ చైనా విషయంలో అప్రమత్తంగా ఉండాలి. దానిని ఎప్పుడూ వంకర దృష్టితోనే చూడాలని రక్షణరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనను చీకాకు పెట్టాలన్న దురాలోచనలో చైనా ఉంది. పాకిస్తాన్‌ తరహాలో చైనా కూడా మనకు సరిహద్దు సమస్యలు సృష్టిస్తూ ఉంటే మన భద్రతా బలగాలు రెట్టింపు అప్రమత్తంగా ఉండటం తప్పనిసరి. దీనిని సీరియస్‌గా తీసుకోకుంటే చైనా మరింతగా రెచ్చిపోయే ప్రమాదం ఉంది. అరుణాచల్‌పై చైనా చేస్తున్న వ్యాఖ్యలను తేలికగా తీసుకోరాదు. గత కొద్ది కాలంగా చైనా మన సరిహద్దుల్లో ప్రవర్తిస్తున్న తీరును అమెరికా నిఘా వర్గాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. అరుణాచల్‌ ప్రదేశ్‌ టిబెట్‌లో భాగమని, అందువల్ల అది చైనాకే చెందుతుందని చైనా ఇంతకాలంగా చెబుతూ వస్తున్నది. అయితే చైనా కబంద హస్తాల నుంచి విముక్తి కోసం ఎన్నో ఏళ్లుగా టిబెటన్లు పోరాడుతున్న విషయం తెలిసిందే. భారత్‌ను రెచ్చగొడుతున్న చైనా మరో వైపు పాకిస్తాన్‌కు మాత్రం అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తున్నది. జమ్మూ`కాశ్మీరు లోని భారత్‌, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో పాకిస్థాన్‌ సైనిక సిబ్బందికి చైనా దళాలు శిక్షణ నిస్తున్నట్లు భారత భద్రతా సంస్థలు గుర్తించాయి. పాకిస్తాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో కూడా చైనా బలగాల కదలికలు ఎక్కువ అయ్యాయి. చైనాలోని జిన్‌జియాంగ్‌ నుంచి పాకిస్తాన్‌లోని గిల్‌జిట్‌` బలూచీస్తాన్‌ వరకూ ఏర్పాటు చేసుకున్న కారాకోరం రహదారిని చేరుకోవడానికి ఈ ప్రాంతం నుంచి రోడ్లు వేసుకోవడానికి పాకిస్తాన్‌ ప్రయత్నం చేస్తున్నది. దీనికి సంబంధించిన సహకారాన్ని అందించేందుకు చైనా ప్రయత్నిస్తున్నది. అంతే కాకుండా జిన్‌జియాంగ్‌ ప్రావిన్స్‌ నుంచి పాకిస్తాన్‌లోని గ్వదర్‌ ఓడరేవు వరకు ప్రతిపాదించిన సిల్క్‌ రోడ్డుపై ఇప్పటికే భారత్‌ తన తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ కదలికలపై ఢల్లీిలోని భద్రతా రంగ నిపుణలు కూడా అంచనాలు వేస్తున్నారు. కచ్చితంగా ఆ ప్రాంతంలో చైనా సైనికులు తిష్టవేయడం భారతదేశ భద్రతకు ప్రమాదకరమే. అదే విధంగా పాకిస్తాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో మూడు సైనిక డివిజన్లను ఏర్పాటు చేసేందుకు కూడా చైనా ప్రయత్నిస్తున్నది. భారత్‌ను ఇబ్బంది పెట్టే ఈ అంశాన్ని పాకిస్తాన్‌ కావాలనే ప్రోత్సహిస్తున్నది.అయితే చైనా, పాకిస్తాన్‌లు అందుకు సంబంధించిన ఏర్పాట్లు చురుకుగా చేసుకుంటున్నాయి. చైనా ` పాకిస్తాన్‌ వాణిజ్య మార్గంగా పేరు పొందిన ఈ సిల్క్‌ రోడ్డు పాకిస్తాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో అభ్యంతరకరమైన ప్రదేశాల నుంచి వెళుతుంది. కారాకోరం రహదారికి సమాంతరంగా వెళ్లే ఈ రోడ్డు దేశ భద్రతకు ఇబ్బంది కలిగిస్తుందనేది భారత్‌కు ఉన్న అభ్యంతరం. తాజాగా తాంగ్దర్‌ సెక్టార్‌లోని నియంత్రణరేఖకు ఆవలి వెపున కూడా చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ కదలికలు ఉన్నట్లు నిఘా సంస్థలు వెల్లడిస్తున్నాయి. వీటిపై మన బలగాలు అప్రమత్తంగా ఉండకుంటే చైనా దుస్సాహసానికి ఒడిగట్టే ప్రమాదం ఉంది.
““““