చేతిపంపులే ఆధారం

చెన్నూర్‌ రూరల్‌, న్యూస్‌లైన్‌: అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజల నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. వాటర్‌ట్యాంక్‌కు నీటిని సరఫరా చేసే మోటారు కాలిపోయి ఏడాది గడస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. మండలంలోని కాచన్‌పల్లి పంచాయితీ పరిధి బావురావుపేట గ్రామంలో 300 కుటుంబాలు ఉన్నాయి. తాగునీటి సౌకర్యార్థం తొమ్మిదేళ్ల క్రితం రూ.8 లక్షల వ్యయంతో 40వేల లీటర్ల సామర్థ్యం గల వాటర్‌ట్యాంక్‌ నిర్మించారు. నీటి కష్టాలు మొదలయ్యాయి. ఏడాది గడుస్తున్నా పట్టించుకునే వారు లేరు. దీంతో చేతిపంపుల వద్ద తాగునీరు తెచ్చుకుంటున్నారు.

గ్రామంలో 14 చేతిపంపులు ఉండగా నాలుగే పని చేస్తున్నాయి. ఎస్టీ కాలనీలో ప్రత్యేకంగా బోరు వేసి మినీ వాటర్‌ట్యాంకు ఏర్పాటు చేశారు. ట్యాంకులోకి నీరు సరఫరా చేసే మోటారు వారం రోజుల క్రితం కాలిపోవడంతో కాలనీవాసులు పాఠశాల సమీపంలోని చేతిపంపు వద్ద నీరు తెచ్చుకుంటున్నారు. అధికారులు విద్యుత్‌ మోటార్లు మరమ్మతు చేయించి నీటి  కష్టాలు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.

నీటికి కష్టమైతంది..

మా ఊళ్లో వాటర్‌ ట్యాంక్‌ ఉంది. కానీ ఏం లాభం. సుక్క నీరు రావడం లేదు. దీంతో తాగునీటికి కష్టమైతంది. అధికారులు మా నీటి సమస్యను తీర్చాలె. చేతిపంపుల వద్ద నీళ్లు తెచ్చుకోవడం ఇబ్బందైతంది.

-కుర్సింగ్‌ లక్ష్మి, గౌడ్‌ కాలనీ

నల్లాల్లో నీళ్లత్తలేవు

మాకు తాగునీళ్లకు గోసైతంది. వాటర్‌ట్యాంక్‌ ఉండి పైపులైన్లు ఉన్నా వత్తలేవు. ప్రతి రోజు చేతిపంపు కాడికెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నం జెర గవర్నమెంటోళ్లు పట్టించుకుని నీటి ఇబ్బంది తీర్చాలె.

-మొండక్క, గౌడ్‌ కాలనీ

పట్టించుకోవాలి

వాటర్‌ట్యాంకు ఉంది కానీ మోటర్‌ చెడిపోయింది. నీళ్లు రావడం లేదు. చేతిపంపు దగ్గర నీళ్ల కోసం గంటల తరబడి నిల్చుంటున్నాం. అధికారులు పట్టించుకొని మాకు తాగు నీటి సౌకర్యం కల్పించాలి. -కావిడి భూదేవి, ఎస్టీకాలనీ