చేనేత రంగానికి కేంద్రం ఉరి


జిఎస్టీ పెంపుతో వస్త్రపరిశ్రమకు గడ్డుకాలం
12శాతం జిఎస్టీతో ఆందోళనలో వ్యాపారులు
విజయవాడ,డిసెంబర్‌24(జనం సాక్షి): కేంద్రం జిఎస్టీ వసూళ్లపై తీసుకుంటున్న నిర్ణయాలు వస్త్ర వ్యాపారు లకు శరాఘాతంగా మారాయి. జనవరి 1నుంచి వస్త్రాలపై ప్రస్తుతం ఉన్న 5 శాతం జీఎస్టీని ప్రభుత్వం 12 శాతానికి పెంచింది. ఇప్పటివరకు కాటన్‌ ఫ్యాబ్రిక్‌ వస్త్రాలపై ఐదు శాతం ఉన్న జీఎస్టీ జనవరి 1 నుంచి పన్నెండు శాతం, సింథటిక్‌ ఫ్యాబ్రిక్‌, ఆర్టిఫిషియల్‌ యార్న్‌లపై ఐదు శాతం ఉన్న జీఎస్టీని పన్నెండు శాతానికి పెంచారు. గార్మెంట్స్‌పై ఐదు శాతం ఉన్న జీఎస్టీ పన్నెండు శాతానికి, డైయింగ్‌, ప్రింటింగ్‌ టెక్స్‌టైల్‌ ఉత్పత్తులపై కూడా ఐదు శాతం ఉన్న జీఎస్టీని పన్నెండు శాతానికి పెంచేశారు. ఇప్పటికే ఆకాశాన్నంటిన వస్త్రాల ధరలు వచ్చే నూతన సంవత్సర ప్రారంభం రోజు నుంచి మరింతగా పెరగను న్నాయి. ఈ భారం వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అటు ప్రజలు కూడా జిఎస్టీ దెబ్బలకు తట్టుకోలేనంతగా నష్టపోవాల్సిన దుస్థితి ఏర్పడిరది. జనవరి 1నుంచి జీఎస్టీ పోటు పెంపుతో వస్త్ర వ్యాపారాలూ కళతప్పనున్నాయి. అంతేకాదు కొత్త సంవత్సరం నూతన వస్త్రాలతో దుకాణాలు కళకళలాడడం ఆనవాయితీ. కానీ రానున్న దీంతో పెరిగిన ధరలతో సేల్స్‌ ఉండ దనే భయంతో వ్యాపారులు కొత్త సరుకు రప్పించలేదు. పెరిగే జీఎస్టీ వల్ల వినియోగదారుడిపై అదనంగా ఏడు శాతం
పన్ను పడుతున్నా, వ్యాపారుల లాభం మార్జిన్‌ కలిపితే పదిశాతం వరకు వస్త్రాల ధరలు పెరగనున్నాయి. దీంతో బిజినెస్‌ పెద్దగా ఉండదనే ఉద్దేశంతో సరుకు తెప్పించడం తగ్గించామని వస్త్రవ్యాపారులు పేర్కొన్నారు. జిల్లాల్లోని వస్త్ర దుకాణాల్లో ఇప్పటికే ఉన్న స్టాకును జనవరి 1నుంచి జీఎస్టీ పెంచి విక్రయించడానికి లేదు. దీంతో ఈనెల 31లోపు పాతస్టాకుపై వ్యాపారం చేసి నాలుగు డబ్బులు సంపాదించుకోవడం కోసం ఎక్కడికక్క డ షాపులు ఆఫర్లు ప్రకటించాయి. ఒకరకంగా చెప్పాలంటే న్యూఇయర్‌ పేరుతో జరిగే కోట్ల లావాదేవీలపై ఒమైక్రాన్‌ ముప్పు, జీఎస్టీ తీవ్రంగా ప్రభావం చూపుతు న్నాయి. నూతన సంవత్సరంలో వస్త్రాలపై కేంద్ర ప్రభుత్వం విధించనున్న 12శాతం జీఎస్టీ వల్ల ధరలు అనూహ్యంగా పెరుగనున్నాయి. ఫలితంగా వినియోగదారులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ముఖ్యంగా లక్షలాది చేనేత కుటుంబాలు ఆధారపడ్డ చేనేత రంగంపై జీఎస్టీ తీవ్ర ప్రభావం చూపనుంది. ఇప్పటి వరకు వస్త్రాలపై ఐదుశాతం ఉన్న జీఎస్టీని జనవరి 1వ తేదీ నుంచి 12 శాతానికి పెంచి అమలు చేయడం వల్ల సంక్రాంతి నేపథ్యంలో కొనుగోలుదారులకు పెనుభారం కానుంది. ఇప్పటికే జీఎస్టీతో వస్త్రాల ధరలు అధికమయ్యాయి. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అటు వస్త్ర వినియోగదారులకు, ఇటు వ్యాపారులకు పెనుభారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వస్త్ర వ్యాపారులు పలుచోట్ల ఆందోళనలకు దిగుతున్నారు. ముఖ్యంగా చేనేతపై ఐదుశాతం ఉన్న జీఎస్టీని పన్నెండు శాతానికి పెంచడం వల్ల నూలు, జరీ, రసాయనాల ధరలు పెరిగిపోయి సహకార సంఘాల్లో కానీ, ప్రైవేటు మాస్టర్‌ వీవర్స్‌ కానీ చేనేత కార్మికులకు పని కల్పించలేని దుస్థితి నెలకొంటుందని చేనేత వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించినప్పటి నుంచి వస్త్రాలపై ఎటువంటి పన్నులు వేయకూడదని నాటి స్వాతంత్య సమరయోధులు ప్రభుత్వాలకు సూచించినప్పటికీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పన్నులు పెంచింది. ఫలితంగా చేనేత రంగంపై ఆధారపడి జీవించే వారికి ఉపాధి కరువయ్యే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో తెలుగు రాష్టాల్రతో పాటు వివిధ రాష్టాల్ర ప్రజలు నూతన వస్త్రాల కొనుగోలుకు మక్కువ చూపుతారు. ఈ పరిస్థితుల్లో రేట్లను అనూహ్యంగా పెంచడం వల్ల వినియోగదారుల్లో కొనుగోలు శక్తి తగ్గి వస్త్ర, వాణిజ్య, వ్యాపార రంగం కుదలయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే హోల్‌సేల్‌ క్లాత్‌ మర్చంట్స్‌ ఆధ్వర్యంలో వ్యాపారులు జీఎస్టీ పెంపుదలకు నిరసన తెలిపారు. ముఖ్యంగా చేనేత వస్త్ర పరిశ్రమకు ఆయువుపట్టుగా ఉన్న తెలుగు రాష్టాల్ల్రోని వివిధ ప్రాంతాలకు చెందిన చేనేత సహకార సంఘాలు, కార్మికులు పెరిగిన జీఎస్టీని తగ్గించాలంటూ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. మంత్రి కెటిఆర్‌ కూడా కేంద్రం తీరుపై మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం వస్త్రాలపై జీఎస్టీని 12శాతానికి పెంచడం వల్ల ప్రజలపై మరింత భారం పడుతుంది. ఇప్పటికే వున్న ఐదు శాతంతోనే తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. జీఎస్టీ పెరగడం వల్ల ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. వస్త్ర వ్యాపారం టర్నోవర్‌ తగ్గడంతో పాటు ఖర్చులు పెరిగిపోతున్నాయి. వస్త్రాలపై జీఎస్టీని పూర్తిగా తొలగించాలని వ్యాపారులు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం వస్త్రాలపై 12శాతం జీఎస్టీ విధింపుతో చేనేత రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. ఇప్పటికే రంగు, రసాయనాలు, నూలు ధరలు విపరీతంగా పెరిగిపోవడం, కార్మికులకు ఉపాధి కల్పించలేని పరిస్థి తులు నెలకొన్నాయి. చేనేత రంగాన్ని ఉద్ధరించాలనుకుంటే జీఎస్టీని పూర్తిగా తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు.