చేసిన అప్పులు తట్టుకోలేక ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్య
మునగాల, ఆగష్టు 11(జనంసాక్షి): చేసిన అప్పులు తట్టుకోలేక, ఆర్థిక ఇబ్బందులు తాళలేక అప్పు ఇచ్చిన వారికి సమాధానం చెప్పలేక తీవ్ర మనస్థాపానికి గురైన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీశ్రీ నగర్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..శ్రీశ్రీ నగర్ లో నివాసముంటున్న గోదేశి నరేంద్రబాబు() చివ్వెంల మండలం గుంజులూరు ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. కొద్దిరోజులుగా అప్పులు ఇచ్చినవారు నరేంద్రబాబుపై తీవ్ర ఒత్తిడి చేయడంతో సమాధానం చెప్పలేక మనస్థాపానికి గురై గురువారం రాత్రి ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుని కుమారుడు మీడియాకు తెలిపాడు. కాగా భార్య ధనలక్ష్మి పెన్ పహాడ్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది. మృతుని కొడుకు తెలిపిన వివరాల ప్రకారం.. తన తండ్రి నరేంద్రబాబు కొద్ది రోజులుగా అప్పులవారికి సమాధానం చెప్పలేక తీవ్రంగా బాధపడతూ ఉండేవాడని, బుధవారం రాత్రి భోజనం చేసి బెడ్ రూమ్ లోకి వెళ్లి పడుకున్నాడని తెలిపాడు. తెల్లవారుజామున తన తల్లి వెళ్లి చూసేసరికి ఫ్యాన్ కి వేలాడుతూ ఉరివేసుకొని ఉండడం గమనించిందని తెలిపాడు. వెంటనే గట్టిగా తనను పిలవడంతో వెళ్లి చూసేసరికి చనిపోయాడని తెలిపాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని మృతుని మృతుని కుమారుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై యాకూబ్ తెలిపారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. నరేంద్రబాబుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
దాదాపు 4కోట్ల అప్పులు:
మునగాల మండలం, విజయరాఘవపురం గ్రామానికి చెందిన గొదేశి నరేంద్రబాబు అదే గ్రామంలో చాలా మంది వద్ద దాదాపు 4కోట్ల రూపాయలు అప్పు చేశాడని గ్రామంలోని కొంతమంది వద్ద నుండి విశ్వసనీయ సమాచారం. అయితే సూర్యాపేటలో మృతి చెందిన నరేంద్రబాబు భౌతిక కాయాన్ని తన సొంత గ్రామమైన విజయరాఘవపురం గ్రామానికి తరలించి ఖననం చేయాలనే ఉద్దేశంతో సూర్యాపేట నుండి అంబులెన్స్ మీద తీసుకువస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న అప్పు ఇచ్చిన గ్రామస్తులు విజయ రాఘవపురం గ్రామ వెలుపల ఉన్న తిరుపతమ్మ గుడి వద్దకు చాలామంది ప్రజలు చేరుకొని అంబులెన్స్ అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఇది తెలుసుకున్న మునగాల పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. భౌతిక కాయాన్ని ఖననం చేయకుండా అడ్డుకున్న గ్రామస్తులను పోలీసులు సముదాయించి నరేంద్రబాబు భార్య, కొడుకు వద్ద పూచీ తీసుకొని ఆత్యక్రియలకు ఏర్పాటు చేసినట్లు సమాచారం