చైనాలోని ఆ ప్రతిష్టాత్మక బ్రిడ్జ్ మూతపడింది
బీజింగ్: అద్భుతమైన అందాల వంతెన.. ప్రపంచంలోనే అత్యంత పొడవైన, ఎత్తైన గాజు వంతెనగా పేరొంది.. గిన్నిస్ బుక్ రికార్డు సొంతం చేసుకున్న చైనా గాజు వంతెనను తాత్కాలికంగా మూసివేశారు. ఇంటర్నల్ సిస్టమ్‌ను ఆధునీకరణ చేసేందుకు గాజు వంతెనను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు చైనా పత్రికలు పేర్కొన్నాయి. మళ్లీ ఎప్పుడు దాన్ని తెరుస్తారనే విషయాన్ని మాత్రం నిర్వాహకులు ప్రకటించలేదు. దీనిపై నిర్వాహకులు సోషల్ మీడియా ద్వారా సందర్శకులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నామని తెలిపారు. ఈ గాజు వంతెనను చూసేందుకు రోజుకి 8వేల మంది పర్యాటకులకే అనుమతించాలనుకున్నారు. కాని రోజుకి 10వేల మంది పర్యాటకులు దీన్ని చూసేందుకు వస్తున్నారు. దాంతో సందర్శకుల రద్దీకి తగినట్లుగా తమ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌లలో మార్పులు చేసుకోవడానికి బ్రిడ్జిని కొన్నాళ్లు మూసివేస్తున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు.
గాజు వంతెనను చూసేందుకు ముందస్తుగా రిజర్వేషన్ చేసుకున్న కొందరు పర్యాటకులు నిర్వాహకులపై మండిపడుతున్నారు. ‘మీరు సందర్శకులను మోసం చేస్తున్నారు, ఈ దశలో ప్రయాణాన్ని రద్దు చేసుకోలేను.. రిజిస్ట్రేషన్ డబ్బులు వెనక్కిరావు.. ప్రపంచంలోనే అతిపెద్ద మోసగాళ్లు మీరు ’.. అంటూ సందేశాలు పంపుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జాగ్జియాంజి పార్కులో రెండు కొండలను కలుపుతూ ఉన్న ఈ గాజు వంతెనను 430 మీటర్ల పొడవు.. భూమికి 300 మీటర్ల ఎత్తులో నిర్మించారు.