చైనాలో అగ్రరాజ్య అధ్యక్షుడికి ఘోర అవమానం
బీజింగ్, సెప్టెంబరు 3: అమెరికా అధ్యక్షుడంటే.. ప్రపంచానికే పెద్దన్న! ఏ దేశానికెళ్లినా.. ‘రాజువెడలె రవితేజములలరగ’ అన్నట్టు రెడ్‌కార్పెట్ స్వాగతాలే!! కానీ, ఎర్ర చైనాలో అమెరికా అధ్యక్షుడి పప్పులుడకలేదు. రెడ్ కార్పెట్ మాట దేవుడెరుగు.. ఆయన ఎక్కి వచ్చిన విమానానికి స్టెయిర్‌కేస్ కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో విమానానికే ఉన్న మెట్ల ద్వారా ప్రత్యామ్నాయమార్గంలో దిగాల్సి వచ్చింది ఒబామా!! జీ-20 సమ్మిట్‌లో పాల్గొనేందుకు చైనా వచ్చిన ప్రెసిడెంట్ ఒబామాకు.. అక్కడి హాంగ్‌ఝౌ విమానాశ్రయంలో చైనా ఇచ్చిన ఝలక్ ఇది. అక్కడితో అయిపోలేదు! ఒబామాతోపాటు వచ్చిన పాత్రికేయుల బృందం ఆయన సమీపంలో ఉండటానికి చైనా అధికారులు అంగీకరించలేదు. దీంతో ఒబామా సిబ్బంది ఆగ్రహోదగ్రులైపోయారు. ‘‘మా నాయకుడి కోసం మేమే రూల్స్ పెడతాం’’ అని వైట్‌హౌస్ అధికారి ఒకరు చైనా అధికారితో చెప్పగా.. ఆ చైనా అధికారి అంతకంటే గట్టిగా.. ‘ఇది మా దేశం.. మా ఎయిర్‌పోర్ట్’ అని సమాధానమిచ్చారు. ‘కాబట్టి ఇక్కడ రూల్స్ మేమే నిర్ణయిస్తాం’ అని చెప్పకనే గట్టిగా తెగేసి చెప్పారు. దీంతో బిత్తరపోవడం వైట్‌హౌస్ అధికారి వంతు అయింది. రగడ అక్కడితో ముగియలేదు. జాతీయ భద్రత సలహాదారు సుసాన్ రైస్‌ను ఒబామాకు దూరంగా ఉంచడానికి ఒక చైనీస్ అధికారి ప్రయత్నించారు. వీటి గురించి ఒక విలేకరి ప్రశ్నించగా.. ‘‘వారు ఊహించని విధంగా ప్రవర్తించారు’’ అని ఆమె సమాధానమిచ్చారు.