చైనా కవ్వింపుకు భారత వాయుసేన చెక్
చైనా దూకుడుకు చెక్ పెట్టే దిశగా భారత వాయుసేన అడుగులు వేస్తోంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని చైనా సరిహద్దులో ఉన్న అత్యంత ఎతె్తైన పర్వత ప్రాంతమైన మెచుకాలో యుద్ధ విమానాన్ని మోహరించింది. సముద్ర మట్టానికి 1830 మీటర్ల ఎత్తున ఉన్న ఈ ఎయిర్ బేస్‌ను ప్రభుత్వం ఇటీవలే ఆధునికీకరించింది. గురువారం ఈ ఎయిర్‌బేస్‌లో బోయింగ్ సి-17 గ్లోబ్ మాస్టర్-3 విమానం విజయవంతంగా ల్యాండైంది. అత్యంత వ్యూహాత్మక ప్రాంతాల్లో ఒకటైన మెచూకా చైనా సరిహద్దుకు 29 కిలో మీటర్ల దూరంలో ఉంది. మరో వైపు చైనా సైన్యం గురువారం మరో మారు కవ్వింపు చర్యలకు దిగింది. లడఖ్‌కు 250 కిలో మీటర్ల దూరంలో తూర్పు ప్రాంతంలో ఉన్న దేంచోక్ సెక్టార్‌లో భారత్ నిర్మిస్తున్న ఓ నీటి కాలువ పనులను అడ్డుకుంది. అది తమ భూభాగమని ఆరోపిస్తూ కాపు కాసింది. దీంతో 70 మంది ఐటీబీపీ, ఆర్మీ బృందం అక్కడకు చేరుకుని చైనా సైన్యాన్ని అడుగు ముందుకు వేయకుండా నిలువరించింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.