‘ఛాంపియన్ల’కు భారీ నజరానా!

– ఒక్కొక్కరికీ రూ. కోటి ఇచ్చేందుకు బీసీసీఐ నిర్ణయంముంబై

జూన్‌ 24 (జనంసాక్షి) :

ఐసిసి ఛాంపియన్స్‌ ట్రోఫీ కైవసం చేసుకున్న భారత క్రికెటర్లపై కాసుల వర్షం కురుస్తోంది. ఇప్పటికే మినీ వరల్డ్‌కప్‌ గెలుచుకోవడం ద్వారా 12 కోట్ల ప్రైజ్‌మనీ దక్కించుకున్న ఆటగాళ్ళకు బీసిసిఐ భారీ నజరానా ప్రకటించింది. జట్టులో సభ్యునిగా ఉన్న ఒక్కో ఆటగాడికీ కోటి రూపాయల చొప్పున క్యాష్‌ ప్రైజ్‌ అందజేయనున్నట్టు తెలిపింది. అలాగే సహాయక సిబ్బందికి కూడా ఒక్కొక్కరికీ 30 లక్షల చొప్పున నజరానా ప్రకటించింది. 2002లో శ్రీలంకతో కలిసి సంయుక్త విజేతగా నిలిచినప్పటకీ.. తొలిసారి పూర్తి స్థాయిలో కప్‌ కైవసం చేసుకోవడం ద్వారా భారత్‌ చరిత్ర సృష్టించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌లో 5 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్‌ను ఓడించింది. తద్వారా కెప్టెన్‌ ధోనీ అన్ని ఫార్మేట్లలోనూ జట్టును విశ్వవిజేతగా నిలిపిన తొలి భారత కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు. 2007 టీ ట్వంటీ వరల్డ్‌కప్‌ , 2010 టెస్టుల్లో నెంబర్‌ వన్‌, 2011 ప్రపంచకప్‌ విజయం ధోనీ ఖాతాలో ఉన్నాయి. చరిత్రలో కలిసిపోనున్న ఛాంపియన్స్‌ ట్రోఫీ చివరి ఎడిషన్‌లో విజేతగా నిలిచిన భారత జట్టును బీసిసిఐ ప్రెసిడెంట్‌ జగ్మోహన్‌ దాల్మియా అభినందించారు. టోర్నీ ఆద్యంతం అద్భుతంగా ఆడిన యువఆటగాళ్లపై ప్రశంసల జల్లు కురిపించారు. రెండు ప్రాక్టీ మ్యాచ్‌లు , మూడు లీగ్‌ మ్యాచ్‌లు , ఒక సెవిూఫైనల్‌తో పాటు ఫైనల్లోనూ జట్టు ప్రదర్శన అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. ధోనీ నాయకత్వంలో యువక్రికెటర్లు పరిణితికి మించి ఆడారని తెలిపారు.