జగన్‌కు ఎపి ప్రయోజనాలే ముఖ్యం

అందుకే జల వివాదాలపై ఆచీతూచీ నిర్ణయం
విమర్శలకు వెరవకుండా పరిష్కారం కోసం చూపు
అమరావతి,ఆగస్ట్‌5( జనంసాక్షి): జగన్‌కు ఏపీ ప్రయోజనాలతో పాటు, ఏపీ రాజకీయం అంత ముఖ్యం. అందుకే అన్ని విషయాల్లో ఆచితూచి ముందు సాగుతున్నారు. ఏపీ ప్రజల అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకుని, తెలంగాణ వాటాను సద్వి నియోగం చేసుకుంటే కేసీఆర్‌ను ఎవరూ తప్పుబట్టరు. కేవలం సెంటి మెంట్‌ కోసం ఆంధ్ర ప్రభుత్వంతో తగాదా పెట్టుకుంటున్నారన్న భావన ఇప్పుడు కలుగు తోంది. కేసీఆర్‌ గోదావరి జలాలను కృష్ణానదిలో కలిపే స్కీమును ప్రతిపాదించి, ఏపీని కూడా అందులో భాగస్వామి కావాలని కోరారు. మొదట ఉత్సుకత చూపిన జగన్‌ ప్రభుత్వం, అందులోని ఇబ్బం దులను గమనంలోకి తీసుకుని వెనక్కి తగ్గిందని అంటున్నారు. కేసీఆర్‌కు అది సంతృప్తిని కలిగించి ఉండకపోవచ్చు. ఆయనకు తెలంగాణ ప్రయోజనాలతో పాటు తెలంగాణ రాజకీయం ఎంత ముఖ్యమో, హుజూరాబాద్‌ ఉప ఎన్నికతో పాటు వచ్చే రెండున్నర ఏళ్లలో రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ, కాంగ్రెస్‌లను ఇరుకున పెట్టడానికి, షర్మిల కొత్త పార్టీని పరిగణనలోకి తీసుకుని? కేసీఆర్‌ నీటి రాజకీయం ఆరంభించారని విశ్లేషణలు వచ్చాయి. ఇదే సమయంలో ఏపీపై కోపంతో కృష్ణా నదిపై పలు
ప్రాజెక్టులను ప్రతిపాదిస్తున్నట్లు కేసీఆర్‌ ప్రకటించడం ఆశ్చర్యంగానే ఉంటుంది. అలంపూర్‌ వద్ద జోగుళాంబ బ్యారేజీ పెట్టి లిప్ట్‌ ద్వారా అరవై, డెబ్భై టీఎంసీల నీటిని తరలించా లని ఒక స్కీము, పులిచింతల ప్రాజెక్టు కింద ఎడమకాల్వ తవ్వాలని మరో స్కీమ్‌, సుంకేసులవద్ద మరో ఎత్తిపోతల పథకం.. నీరు అందు బాటులో ఉన్నంతవరకు స్కీములు చేపట్టవచ్చు. హడావిడిగా చేపడితే తెలంగాణకు నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. తెలంగాణ వారికే కృష్ణా జలాలలో సింహభాగం దక్కాలని, పాత వాటాలని సమూలంగా పెరికివేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం భావించడం వల్లనే ఇప్పుడు ఇరు రాష్టాల్రమధ్య సయోధ్య లోపిస్తోంది. బచావత్‌ ట్రిబ్యునల్‌ ఇరు రాష్టాల్రలోని ప్రాజెక్టుల నీటి అవసరాలను క్షుణ్ణంగా పరిశీలించాకే జలాల వాటాలను నిర్ణయించింది. ఈ వాటాల పరిమాణాలకు మిగతా ఇద్దరి కక్షిదారుల అంగీకారం ఉండేటట్టు కూడా ట్రిబ్యునల్‌ చూసింది. ఏ ప్రాతిపదికన నీటి పంపిణీ జరగాలన్న అంశంపై విస్తృత చర్చ జరిగి ఏకాభిప్రాయం సాధించాక మాత్రమే ట్రిబ్యునల్‌ ముందుకుసాగింది. ఇది జరిగి యాభై ఏళ్లు అయ్యాక ఇంకొక ట్రిబ్యునల్‌ కూడా తిరిగి అన్ని అంశాలనూ పరిశీలించి పాత వాటాలలో మార్పు అవసరం లేదనే భావించింది.