జగన్‌పై తీవ్రమైన టిడిపి విమర్శల దాడి
విజయవాడ,ఆగస్ట్6(జనం సాక్షి): రాష్ట్రవ్యాప్తంగా జగన్ వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టిడిపి నేతలు తమ విమర్వలు తీవ్రం చేశారు. ప్రధానంగా టిడిపి ప్రభుత్వంపై,చంద్రబాబుపై చేస్తున్నవిమర్శలను టిడిపి శ్రేణులు ఎక్కడిక్కడే విమర్శిస్తున్నారు. జగన్ తన నేర ప్రవృత్తిని బయటపెట్టుకున్నారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. జగన్ లాంటి ప్రతిపక్ష నేతను గతంలో ఎప్పుడూ ఎక్కడా చూడలేదని మంత్రి అన్నారు. ఓటమి భయంతోనే జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. హింసను ప్రేరేపించే జగన్‌కు ప్రతిక్ష నేతగా ఉండే అర్హత లేదన్నారు. కాపు రిజర్వేషన్లపై జగన్ వ్యాఖ్యలు సిగ్గుచేటని గుంటూరు జిల్లా టిడిపి అధ్యక్షుడు జివి ఆంజనేయులు అన్నారు. ఇలాంటి ఫ్యాక్షన్ లీడర్ వల్ల ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యిందన్నారు. వైకాపా నేతలు జగన్ వైఖరిపై ఆలోచన చేయాలన్నారు. జగన్ మాట్లాడుతున్న భాష చూస్తుంటే అతను అసహనంలో ఉన్నాడని అర్థంఅవుతోందని తూర్పుగోదావరి జడ్పీ చైర్మన్ నామన రాంబాబు అన్నారు. రాష్ట్రం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి విూకు కనిపించడం లేదా అని జగన్‌ను ప్రశ్నించారు. రైతు. డ్వాక్రా రుణమాఫీ, పింఛన్లు ఇలా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామంటే అది మా నాయకుడు చంద్రబాబు వల్లే సాధ్యమైందన్న విషయాన్ని గుర్తుంచు కోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో పుట్టగతులు ఉండవనే ఇలా మాట్లాడుతున్నారని అన్నారు.