జట్టు ఎంపికలో కోహ్లీకి సాయం చేయండి

– మాజీ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ సూచన
న్యూఢిల్లీ, ఆగస్టు16(జ‌నం సాక్షి) : ఇంగ్లాండ్‌తో జరగబోయే మూడో టెస్టు కోసం భారత జట్టు ఎంపికలో విరాట్‌ కోహ్లీకి సాయం చేయాలని పేర్కొన్నారు మాజీ క్రికెటర్‌ సునీల్‌ గావాస్కర్‌. లార్డ్స్‌ టెస్టులో ఉమేశ్‌ యాదవ్‌ను తప్పించి కుల్‌దీప్‌కు స్థానం కల్పించడంపై పలు అనుమానాలు లేవనెత్తాయి. అంతేకాదు, కోహ్లీ టెస్టు సారథ్య బాధ్యతలు అందుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకసారి ఆడిన జట్టుతో వరుసగా రెండో టెస్టు ఆడింది లేదు. జట్టులో మార్పులు చేస్తూనే ఉన్నాడు. ఈనేపథ్యంలో సునీల్‌ గావస్కర్‌ మాట్లాడుతూ… ‘ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో సెలక్టర్లు శరణ్‌దీప్‌ సింగ్‌, దేవాంగ్‌ గాంధీ ఉన్నారు. కానీ, బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ను ఇంగ్లాండ్‌ పంపాలని కోరుకుంటున్నాను. కోహ్లీతో కలిసి ప్రసాద్‌ నాటింగ్‌హామ్‌ వేదికగా జరిగే మూడో టెస్టుకు తుది జట్టును ఎంపిక చేయాలి. ఎందుకంటే సిరీస్‌లో ఇంకా నిలవాలంటే ఈ టెస్టులో తప్పక గెలవాలి. లేదంటే సిరీస్‌ ఇంగ్లాండ్‌ కైవసం అవుతుంది. ఈ విషయాన్ని మరిచపోవద్దు అని గావస్కర్‌ అన్నారు. విరాట్‌ కోహ్లీ ప్రస్తుతం తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాడని, తాను ఆడినప్పటికీ, జట్టు సరైన ప్రదర్శన చేయకపోతే ఆ ఒత్తిడి కెప్టెన్‌పై ఉంటుందన్నారు. విరాట్‌ ఇప్పుడు ఆ పరిస్థితినే ఎదుర్కొంటున్నడన్నారు. తుది జట్టు ఎంపికకు సంబంధించి అందరూ ఇప్పుడు అతడ్ని ప్రశ్నిస్తున్నారు. గత ఐదు టెస్టులకు పరిగణనలోకి తీసుకుంటే కోహ్లీ ఎంపిక సరిగా లేదు. ఒక్క జొహన్నెస్‌బర్గ్‌ టెస్టులోనే భారత్‌ విజయం సాధించింది. మిగతా నాలుగు టెస్టుల్లోనూ పరాజయాలే. అందుకే కోహ్లీకి సాయం చేయమని అంటున్నా. కోహ్లీతో ఎమ్మెస్కే ఉంటే ఇరువురు వ్యూహాలను పంచుకునే అవకాశం ఉంటుందని  తెలిపాడు.  ఈ క్రమంలో చోటు చేసుకునే చర్చ ఇద్దరికీ కలిసి వస్తోందని, అందుకే సెలక్టర్లు, టీమ్‌ మేనేజ్‌మెంట్‌తో చర్చించి జట్టును ఎంపిక చేయాలని కోరుకుంటున్నా అని గావాస్కర్‌ వివరించారు.
———————————–