జనంలోకి వెళ్తాం..పోరు ఉధృతం చేస్తాం
` రాహుల్‌తో భేటి అనంతరం తెలంగాణ కాంగ్రెస్ నేతల వెల్లడి
న్యూఢల్లీి,మార్చి 30(జనంసాక్షి):రాష్ట్రంలో ఏప్రిల్ ఒకటి తర్వాత నుంచి క్షేత్ర స్థాయిలో ప్రజాపోరాటాలను ఉద్ధృతం చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రకటించారు. దిల్లీలో రాహుల్గాంధీతో సమావేశమైన నేతలు .. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై చర్చించారు. 25 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో పార్టీ సభ్యత్వాల నమోదుతో పాటు, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాట కార్యాచరణను చర్చించినట్టు రేవంత్ తెలిపారు. ఏప్రిల్ 4న రాష్ట్ర నేతలతో మరోసారి రాహుల్ గాంధీ భేటీ కానున్నారు. ధాన్యం కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని జనంలోకి తీసుకెళ్తామని రేవంత్ తెలిపారు. ఇందుకోసం రాష్ట్రానికి రావాలని రాహుల్ను కోరితే .. సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.‘‘వరి ధాన్యం కొనుగోలు విషయంలో .. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ రైతుల మరణాలకు కారణమయ్యారు. ఇప్పటి వరకు సభ్యత్వ నమోదుపై దృష్టి పెట్టాం. ఏప్రిల్ 1 నుంచి ప్రజాసమస్యలు, రైతులు, విద్యార్థుల సమస్యలపై క్షేత్రస్థాయిలో ఉద్ధృతంగా పోరాటం చేయాలని నిర్ణయించాం’’ అని రేవంత్రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ నేతలు ఉత్తమ్కుమార్రెడ్డి, గీతారెడ్డి, జానారెడ్డి, అంజన్కుమార్ యాదవ్, మల్లురవి, షబ్బీర్ అలీ, దామోదర రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య, బలరామ్ నాయక్, మహేశ్వర్రెడ్డి తదితరులు రాహుల్ను కలిసిన వారిలో ఉన్నారు.రైతుల సమస్యలను రాజకీయం చేయడంలో సీఎం కేసీఆర్ తీరిక లేకుండా ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి విమర్శించారు. దిల్లీలో ఉన్న రేవంత్.. ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్పై విమర్శలు గుప్పించారు. అన్నదాతల పట్ల కాంగ్రెస్ పార్టీ నిబద్ధత కేటీఆర్కు తెలియకపోవడం బాధాకరమన్నారు. హరిత విప్లవం, వ్యవసాయ భూమి సీలింగ్ చట్టం, కనీస మద్దతు ధర, నిత్యావసర వస్తువుల చట్టం, ఉపాధి హావిూ, సమగ్ర పంటల బీమా, ఆహార భద్రత, ఉచిత విద్యుత్, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ఎవరి ఘనత అని రేవంత్ ప్రశ్నించారు. రూ.70 వేల కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని గుర్తు చేశారు. ఇక్రిశాట్ వంటి సంస్థల ఏర్పాటు, 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చామని పేర్కొన్నారు. భూసేకరణ చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా.. అని ప్రశ్నించారు. పాలమూరు`రంగారెడ్డి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.10వేల కోట్లతో ధాన్యం కొనుగోలు చేయడం పెద్ద సమస్యేవిూ కాదని రేవంత్ వెల్లడిరచారు.