జనసేన – టీడీపీ కలిస్తే తప్పేంటి?

– తెదేపాతో జనసేన కలిసే అవకాశాలు మెండుగా ఉన్నాయి

– ప్రజాధరణ ఉన్నవారికే బాబు టికెట్లు ఇస్తారు

– తెదేపా ఎంపీ టీజీ వెంకటేష్‌

అమరావతి, జనవరి23(జ‌నంసాక్షి) : టీడీపీ-జనసేన కలిస్తే తప్పేముందని టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్‌ ప్రశ్నించారు. మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డితో కలిసి బుధవారం టీజీ వెంకటేశ్‌ చంద్రబాబుని తన నివాసంలో కలిశారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. జనసేన-టీడీపీ మధ్య ఎలాంటి విభేదాలు లేవని.. కేవలం కేంద్రంపై పోరాటం చేసే విషయంలో అభిప్రాయ భేదాలు ఉన్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటూ పెద్ద బాంబే పేల్చారు. మార్చి నెలలో చర్చలు ఉంటాయంటూ వెంకటేష్‌ పేర్కొన్నారు. జనసేన అధినేతకు సీఎం కుర్చీపై ఆశలేదని ఎన్నో సందర్భాల్లో చెప్పారని టీజీ వెంకటేశ్‌ గుర్తు చేశారు. పవన్‌ కళ్యాణ్‌ ప్రజలకు మంచి చేయడమే లక్ష్యమన్నారని.. కాబట్టి రెండు పార్టీల మధ్య పొత్తు ఉండే అవకాశాలు లేకపోలేదంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ కలిసి పోటీ చేసిన విషయాన్ని టీజీ గుర్తు చేశారు. గతంలో ఇద్దరు నేతల మధ్య విభేదాలు ఉండేవని.. కాని బీజేపీని ఓడించేందుకు కలిసి పోటీ చేయలేదా అన్నారు. జనసేన-టీడీపీ మధ్య పొత్తుపై కార్యకర్తలుగా ఉన్న తాము తేల్చలేమని.. అధినేతలు చర్చిస్తారన్నారు. ఎన్నికల్లో తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు గెలిచేవాళ్లకే అవకాశాలు ఇస్తారని.. ఈ క్రమంలో తన కుమారుడికి కూడా అవకాశం వస్తుందని ఆశిస్తున్నట్లు టీజీ చెప్పారు. కర్నూలు అసెంబ్లీ సీటు విషయంలో సర్వే నివేదికల బట్టే నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. సర్వేల్లో తన కుమారుడు టీజీ భరత్‌కు ఎక్కువ ప్రజాదరణ వస్తే కర్నూలు అసెంబ్లీ టికెట్‌ ఇవ్వాలని.. ఒకవేళ ఎస్వీ మోహన్‌ రెడ్డికి వస్తే ఆయనకు ఇవ్వాలన్నారు. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబుకి చెప్పానని టీజీ తెలిపారు.