జపాన్‌లో భారీ భూకంపం
ఉత్తర జపాన్‌లో మంగళవారం ఉదయం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.4తీవ్రతతో భూకంపం సంభవించినట్లు జపాన్ వాతావరణ ఏజెన్సీ తెలిపింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు సునామీ హెచ్చరికలను జారీ చేశారు. అనంతరం తీవ్రత తగ్గడంతో సునామీ హెచ్చరికలను ఉపసంహరించుకున్నారు. భూకంపం కారణంగా జపాన్ రాజధాని టోక్యోలో 30సెకన్ల పాటు భవనాలు వణుకుపాటుకు గురయ్యాయి. భూకంప తీవ్రత ప్రారంభంలో 7.4గా ఉన్నా క్రమంగా తగ్గి 6.9గా నమోదైనట్లు తెలిపింది. సముద్రంలో 3మీటర్లకు పైగా అలలు ఎగిసిపడటంతో తాము భయాందోళనలకు గురైనట్లు స్థానికులు తెలిపారు. ఈ అలలు తమను 2011నాటి సునామీ ఘటనను గుర్తు చేసినట్లు పలువురు తెలిపారు. ఫుకుషిమా న్యూక్లియర్ ప్లాంట్‌లోని కూలింగ్ సిస్టమ్(మూడో రియాక్టర్)ను తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు. పరిస్థితి అదుపులోకి వచ్చాక ఈ సిస్టమ్‌ను తిరిగి ప్రారంభిస్తామని… అది కూడా తక్కువ ఉష్ణోగ్రత నుంచి క్రమంగా పెంచుతామని.. నిపుణుల పర్యవేక్షణలోనే ఇదంతా చేస్తామన్నారు. 2011లో ఇదే ప్రాంతంలో సునామీ రావడంతో తీవ్ర నష్టం జరిగిన కారణంగా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ప్లాంట్‌లో ఎలాంటి నష్టం జరగలేదని… కొన్ని సిస్టమ్స్ యథావిధిగా పనిచేస్తున్నాయని అన్నారు.