జమిలి ఎన్నికలు అంత సులువు కాదు

– నిర్వహణకు ఈసీ సిద్ధంగా లేదు
– అవసరమైన సదుపాయాలు మా వద్ద లేవు
– రెండుమూడు నెలల్లో తుది నిర్ణయం తీసుకుంటాం
– జమిలి ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం చీఫ్‌ ఓపీ రావత్‌
న్యూఢిల్లీ, ఆగస్టు14(జ‌నం సాక్షి) : జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన సదుపాయాలు తమ వద్ద లేవని, జమిలి ఎన్నికల నిర్వహణ అంత తేలికైన విషయం కాదని భారత ఎన్నికల సంఘం తేల్చి చెప్పేసింది. జమిలి ఎన్నికల పక్రియను వేగవంతం చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా లా కమిషన్‌కు లేఖ రాసిన విషయం విధితమే. ఈ తరుణంలో మరుసటి రోజే ఈసీ ఈ ప్రకటన చేయడం గమనార్హం. వచ్చే ఏడాది లోక్‌సభ, రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ఎన్నికల సంఘం పేర్కొంది. ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు సరిపడినన్ని వీవీపీఏటీలు మా వద్ద లేవని ఎన్నికల సంఘం చీఫ్‌ ఓపీ రావత్‌ పేర్కొన్నారు. వీవీపీఏటీ మెషీన్ల కోసం సకాలంలో ఆర్డర్‌ చేయాల్సి ఉందన్నారు. జమిలి ఎన్నికలపై రెండు మూడు నెలల్లోగా తుదినిర్ణయం ప్రకటిస్తామని రావత్‌ వెల్లడించారు.
ఒకే దేశం ఒకే ఎన్నికలు నినాదంతో జమిలి ఎన్నికల కోసం బీజేపీ ఇటీవల దూకుడు ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే అంశంపై నిన్న అమిత్‌షా లా కమిషన్‌కు లేఖ రాశారు. సంవత్సరం పొడవునా రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న కారణంగా అభివృద్ధి కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం పడుతోందని ఈ లేఖలో పేర్కొన్నారు. చాలామంది అధికారులు ఎన్నికల డ్యూటీలో గడపాల్సి రావడం వల్ల మాటామాటికీ జరుగుతున్న ఎన్నికలతో ఖర్చు పెరిగిపోతున్నదని ఆయన పేర్కొన్నారు. ఈ తరుణంలో ఎన్నికల నిర్వహణపై ఈసీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఒకే దేశం ఒకే ఎన్నిక నిర్వహించాలంటే అందుకు సరిపడా పోలీస్‌, పోలింగ్‌ సిబ్బంది అవసరం ఉంటుందని రావత్‌ పేర్కొన్నారు. లోక్‌సభ, రాష్ట్రాలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల పలు ప్రయోజనాలున్నాయంటూ భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా న్యాయ కమిషన్‌కు లేఖ రాసిన మరుసటి రోజే రావత్‌ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. జమిలి ఎన్నికల ప్రతిపాదనను కాంగ్రెస్‌ సహా చాలా పార్టీలు వ్యతిరేకించాయి. దీనిపై న్యాయ కమిషన్‌ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 2019 ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్‌ ఓటింగ్‌ యంత్రాలు(ఈవీఎం), వీవీప్యాట్‌ యంత్రాలను సిద్ధం చేస్తోంది. 13.95లక్షల బ్యాలెట్‌ యూనిట్స్‌, 9.3లక్షల కంట్రోల్‌ యూనిట్స్‌ సెప్టెంబరు 30 నాటికి రానుండగా.. 16.15లక్షల వీవీప్యాట్‌లు నవంబరు నెలాఖరుకు అందుబాటులోకి వస్తాయని రావత్‌ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసింది. ఎన్నికల సమయంలో యంత్రాలు మొరాయించినా, తారుమారు చేసినట్లు ఆరోపణలు వచ్చినా వాటిని మార్చేందుకు మరికొన్ని వీవీప్యాట్‌లను సిద్ధం చేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఒకవేళ లోక్‌సభ, రాష్టాల్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలంటే అందుకు దాదాపు 24లక్షల ఈవీఎంల అవసరం ఉంటుంది.