జమిలి ఎన్నికల నిర్వహణ అసాధ్యం

చట్ట సవరణ చేస్తే తప్ప కుదరదు

ఇప్పటికిప్పుడు అయితే అసలే సాధ్యం కాదు

స్పష్టం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

న్యూఢిల్లీ,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): జమిలి ఎన్నికల ప్రతిపాదనలను కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. ఇప్పటికిప్పుడు జమిలి సాధ్యం కాదని తేల్చి చెప్పింది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం సాధ్యం కాదని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. రాజ్యాంగ సవరణలతో తప్పితే జమిలి ఎన్నికలు ఇప్పట్లో సాధ్యం కాదని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఓపీ రావత్‌ తెలిపారు. ఒకవేళ జమిలి ఎన్నికలు నిర్వహించాలనుకుంటే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల పదవీ కాలం పొడిగించాల్సి ఉంటుందని, మరికొన్నింటికి తగ్గించాల్సి ఉంటుందన్నారు. అయితే, బీజేపీ ప్రతిపాదించినట్లుగా 11 రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యమన్నారు. ఇందుకోసం ఆయా రాష్ట్రాల అసెంబ్లీలను రద్దు చేస్తూ తీర్మానించాల్సి ఉంటుందన్నారు. జమిలి ఎన్నికలపై ఇటీవల కేంద్రం కసరత్తు చేస్తోంది. త్వరలో జరిగే రాష్ట్రాలతో కలసి కేంద్ర ఎన్నికలను నిర్వహించాలని చెబుతూ వచ్చింది. తాజాగా కేంద్రన్యాయశాఖకు బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా లేఖ కూడా రాశారు.