జమ్మలమడుగు మండలంలో ఉద్రిక్తత

ఇరుపార్టీల నేతల రాకతో గొరిగెనురులో పోలీస్‌ పహారా

కడప,నవంబర్‌21(జ‌నంసాక్షి): జమ్మలమడుగు మండలం గొరిగెనురు గ్రామంలో ఇరువర్గాల నేతల రాకతో ఉద్రిక్తత ఏర్పడింది. వైకాపా టిడిపి నేతలు పోటాపోటీగా వచ్చి పార్టీలో చేరికలను ప్రోత్సహించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసు పహారా నడుమ శాంతి భద్రతల పరిశీలన చేస్తున్నామని డిఎస్పీ కోలా క్రిష్ణన్‌ అన్నారు. గొరిగెనురు గ్రామంలో తలారి సామాజిక వర్గానికి చెందిన మంత్రి ఆదినారాయణ రెడ్డి వర్గానికి చెందిన దాదాపు 10 కుటుంబాలు వైసిపి లో చేరడానికి సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపి అవినాష్‌ రెడ్డి గ్రామానికి వస్తున్నారనే సమాచారంతో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మాజీ ఎంపిని, జమ్మలమడుగు వైసిపి సమన్వయకర్త సుధీర్‌ రెడ్డి, మేయర్‌ సురేష్‌ బాబులను, మంత్రి ఆదినారాయణ రెడ్డి వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, శివనాథ్‌ రెడ్డి, రామాంజుల రెడ్డి, చిన్న కొమెర్ల మోహన్‌ రెడ్డి లను హౌస్‌ అరెస్ట్‌ చేశామని డిఎస్పీ పేర్కొన్నారు. ఇందులో భాగంగా గొరిగెనురు, ధర్మాపురం, పెద్దదండ్లూరు గ్రామాల్లో 144 సెక్షన్‌ ఏర్పాటు చేసి, మూడు గ్రామాల్లో స్పెషల్‌ పార్టీ సిబ్బందితో కవాతు నిర్వహిస్తున్నామని తెలిపారు.

ముందస్తు అరెస్ట్‌లు

ఎర్రగుంట్ల మండలం నిడిజివ్వి గ్రామంలో వైసిపి జమ్మలమడుగు సమన్వయ కర్త సుధీర్‌ రెడ్డిని, మాజీ ఎంపి అవినాష్‌ రెడ్డి, కడప మేయర్‌ సురేష్‌ బాబు లను పోలీసులు బుధవారం హౌస్‌ అరెస్టు చేశారు. జమ్మలమడుగు మండలం గొరిగనూరు గ్రామంలో మంత్రి ఆదినారాయణ రెడ్డి వర్గీయులు, కొంత మంది తలారి సామాజిక వర్గానికి చెందిన కార్యకర్తలు టిడిపి నుంచి వైసిపిలోకి చేరుతున్న నేపథ్యంలో… శాంతి భద్రతలకు భంగం కలుగుతుందేమోనని ముందస్తు చర్యగా పోలీసులు హౌస్‌ అరెస్ట్‌లు చేస్తున్నారు.