జయశంకర్‌కు మంత్రుల నివాళి

సార్‌ ఆశయాలకు అనుగుణంగా కెసిఆర్‌ పాలన: ఈటల

హైదరాబాద్‌,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి ): తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య శ్రీకొత్తపల్లి జయశంకర్‌ సార్‌ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. నాలుగు కోట్ల ప్రజల్లో ఉద్యమ చైతన్యాన్ని రగిలించిన ఉద్యమ స్ఫూర్తి ప్రదాత జయశంకర్‌ సార్‌కు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌.. నివాళులర్పిస్తూ ట్వీట్‌ చేశారు. ఆదిలాబాద్‌ పట్టణంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌కు పలువురు ఘనంగా నివాలి అర్పించారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి మంత్రి జోగు రామన్న నివాళు లర్పించారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ స్ఫూర్తితో ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర గృహ నిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఆచార్య జయశంకర్‌ సార్‌ విగ్రహానికి ఇంద్రకరణ్‌ రెడ్డి పూలదండ వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ .. తన జీవితాన్ని తెలంగాణకు అంకితం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆయన ఆశయాల ద్వారానే బంగారు తెలంగాణ సాధ్యమని, ఆ దిశగా సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని స్పష్టం చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ చిత్రపటానికి పూలమాల వేసి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు నిరంజన్‌ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. ఇదిలావుంటే కరీంగనగర్‌ పట్టణంలోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహానికి మంత్రి ఈటెల రాజేందర్‌, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ.. జయశంకర్‌ సార్‌ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్‌ సమర్థవంతమైన పాలన అందిస్తున్నారని తెలిపారు. గతంలో కరెంట్‌ కోసం అనేక కష్టాలు పడ్డామని గుర్తుచేశారు. తెలంగాణ వచ్చిన తరువాత రైతులకు 24 గంటల కరెంట్‌ ఇస్తున్నామని చెప్పారు. రైతులకు పంటపెట్టుబడి ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ అని తెలిపారు. మిషన్‌ భగీరథతో ఇంటింటికి మంచినీరు అందిస్తున్నాం. హరిత తెలంగాణతో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ పనిచేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. అనంతరం పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని పూట్నుర్‌ గ్రామంలో రైతులకు రైతు బీమా చెక్కులను పంపిణీ చేశారు. హరితహారంలో భాగంగా మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్‌ సత్యనారాయణ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌ రావు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కరీంనగర్‌ మండలం ముగ్ధుంపూర్లో రైతులకు బీమా పత్రాలు పంపిణీ చేసి మంత్రి ఈటల రాజేందర్‌ ప్రసంగించారు.

———————