జస్టిస్‌ పున్నయ్య కన్నుమూత


– అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి
– పున్నయ్య మృతికి పలువురు నివాళి
విజయవాడ, డిసెంబర్‌1(జ‌నంసాక్షి) : ఉమ్మడి ఆంధప్రదేశ్‌ మాజీ స్పీకర్‌ ప్రతిభా భారతి తండ్రి, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ కొత్తపల్లి పున్నయ్య(96) కన్నుమూశారు. విశాఖపట్నంలోని పినాకిని ఆసుపత్రిలో చికిత్సపొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. అక్టోబరు 25న అనారోగ్యానికి గురికావడంతో ఆయనను ఆసుపత్రిలో చేర్పించినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పటి నుంచి వెంటిలేటర్‌ పై చికిత్సపొందుతున్న ఆయన ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో మృతిచెందినట్లు బంధువులు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం కావలి గ్రామానికి చెందిన పున్నయ్య 1952లో రెండేళ్లపాటు శ్రీకాకుళం జిల్లా కోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. తరువాత కాలంలో రాజకీయాల్లోకి వచ్చారు. 1955లో అప్పట్లో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న చీపురపల్లి నియోజవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1952-1962
వరకూ శ్రీకాకుళం జిల్లా జడ్పీ ఉపాధ్యాక్షుడిగా పనిచేశారు.1962లో రాజకీయాలు వదులుకొని హైకోర్టు న్యాయవాదిగా వెళ్లారు. 1974-85 వరకూ ఉమ్మడి ఆంధప్రదేశ్‌ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు. 2000 సంవత్సరంలో ఎన్డీఎ ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌గానూ పనిచేశారు.
పున్నయ్య కుమార్తె కావలి ప్రతిభా భారతి ఎచ్చెర్ల నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ఉమ్మడి ఆంధప్రదేశ్‌ రాష్ట్ర శాసన సభ తొలి మహిళా స్పీకర్‌గానూ, రాష్ట్ర కేబినెట్‌ మంత్రిగానూ పనిచేశారు. ఎమ్మెల్సీగా రెండేళ్లపాటు పనిచేశారు. ప్రస్తుతం వీరి కుటుంబం స్వగ్రామమైన కావలిలో నివసిస్తున్నారు. పున్నయ్య మరణంతో కావలితోపాటు శ్రీకాకుళం జిల్లాలో విషాద ఛాయలు అలముకున్నాయి. జస్టిస్‌ కె. పున్నయ్య మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. పున్నయ్య కుటుంబ సభ్యులకు తన సానుభూతి ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి సిఫారసుల కోసం 2001లో తాము జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ ఏర్పాటు చేసిన విషయం గుర్తుచేశారు. జస్టిస్‌ పున్నయ్య మృతిపట్ల మంత్రులు నారాలోకేశ్‌, కళావెంకట్రావు, యనమల, అచ్చెన్నాయుడు, సహచర మంత్రులు దిగ్భాంతి వ్యక్తంచేశారు. అధికారిక లాంఛనాలతో జస్టిస్‌ పున్నయ్య అంత్యక్రియలు నిర్వహిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. అదేవిధంగా ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ పున్నయ్య మృతి నివాళులర్పించారు.