జాతరకు ముందే జనసంద్రం

` మేడారంలో పెరిగిన భక్తుల రద్దీ..
` వనదేవతల వద్ద కిక్కిరిసిన భక్తజనం
` సమ్మక్క`సారలమ్మ దర్శనాలకు భారీగా తరలివస్తున్న భక్తులు
` సంక్రాంతి సెలవులు కావడంతో పెరిగిన రద్దీ
ములుగు (జనంసాక్షి):ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క`సారలమ్మ ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు వన దేవతలను దర్శించుకుంటున్నారు. ఈరోజు ఆదివారం కావడం, స్కూళ్లు, కాలేజీలకు సంక్రాంతి సెలవులు రావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఒడిశా నుంచి కూడా భారీగా తరలివచ్చి జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించుకుంటున్నారు. అనంతరం ఆలయంలో మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆదివారం నుంచి వరుస సెలవులు రావడంతో భారీగా తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. రద్దీ కారణంగా సమ్మక్క సారలమ్మ గద్దెల విూదకు భక్తులను పోలీసులు అనుమతించడం లేదు. మేడారంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పర్యటించారు. ఆయనతో పాటు మంత్రులు కొండా సురేఖ, సీతక్క, శ్రీధర్‌ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌లు ఈ పర్యటనలో పాల్గొన్నారు. అధికారులతో కలిసి మేడారం జాతర పనులపై సవిూక్షా సమావేశం నిర్వహించిన అనంతరం విూడియాతో మాట్లాడారు. మేడారం మహాజాతర తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మహాజాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. మేడారంలో శాశ్వత నిర్మాణాలు జరుగుతున్నాయని, రూ.251 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. మరో 2 రోజుల్లో పనులన్నీ పూర్తవుతాయని వెల్లడిరచారు.