జాతీయస్థాయి పంచాయతీ అవార్డులలో మహబూబాబాద్ జిల్లా ముందుండాలి
మహాబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్ 9(జనంసాక్షి)
జాతీయ స్థాయి పంచాయతీ అవార్డులలో మహబూబాబాద్ జిల్లా ఎక్కువ అవార్డులు సాదించాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక అన్నారు. గ్రామ పంచాయతీలు సుస్థిర అభివృద్ధి సాదించడానికి కేంద్ర ప్రభుత్వం సూచించిన 9 లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించి ఎక్కువ సంఖ్యలో అవార్డులు పొందేందుకు గాను శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నోడల్ అధికారులకు నిర్వహించిన శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పంచాయతీ అవార్డులు సాదించడం పై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీల అవార్డులకు గాను జాతీయ స్థాయి లో సూచించిన పేదరిక నిర్మూలన, ఆరోగ్యం, భాలల వికాసం, మహిళా సాధికారత, పచ్చదనం పరిశుభ్రత, మౌళిక సదుపాయాలు, పరిశుభ్రమైన త్రాగునీరు, గుడ్ గవర్నెన్స్, సామాజిక భద్రత తో పాటు గ్రామాలలో చేపట్టిన అభివృద్ధి పనులన్నీ తెలియజేసి ఎక్కువ సంఖ్యలో అవార్డులు సాదించాలని కలెక్టర్ సూచించారు. ప్రధానంగా ఇప్పటికే మొదటి మూడు, ఐదవ స్థానంలో ఉన్న పంచాయతీలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అవార్డు పొందడం ద్వారా గుర్తింపు తో పాటు ప్రతిష్ట పెరుగుతుందని మరింత ఉత్సాహం నింపుతుందన్నారు. నోడల్ అధికారులు, మండల, గ్రామ స్థాయి సిబ్బందికి శిక్షణను ఇచ్చి అవగాహన పరచాలన్నారు. ఇట్టి కార్యక్రమంలో తాను కూడా ఐదు గ్రామ పంచాయతీలను దత్తత తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, జెడ్పీ సిఈఓ, డీఆర్డీఓ ఒక్కొక్కరు ఐదు గ్రామాల చొప్పున దత్తత తీసుకోవాలని, సీనియర్ అధికారులు కూడా దత్తత తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ జిల్లాలోని 461 గ్రామ పంచాయతీలలో వివిద రకాల అభివృద్ధి పనులు చేపట్టామని, జాతీయ పంచాయతీ అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం సూచించిన 9 రకాల పనులు అన్ని గ్రామ పంచాయతీలలో పూర్తి స్థాయిలలో ఉండేలా సరి చూసుకోవాలని అవార్డుల ఎంపిక కోసం నిర్దేశించిన ఆన్లైన్ లో ప్రశ్నావళిని సక్రమంగా పూరించేందుకు శిక్షణ ద్వారా అవగాహాన కల్పించుకుని సందేహాలను నివృత్తి చేసుకోవాలన్నారు. జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా, జిల్లా పరిషత్ సిఈఓ రమాదేవి, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి సన్యాసయ్యా, మిషన్ భగీరథ ఎస్ఈ కృష్ణారెడ్డి, డిప్యూటీ డిఎంహెచ్ఓ అంబరీష్ ఎంపిడీఓలు, ఎంపిఓలు,మెడికల్ ఆఫీసర్లు ఏపిఓలు, ఏపియం లు తదితరులు పాల్గొన్నారు.