జాతీయ క్రీడా విశ్వవిద్యాలయ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

 

రాష్ట్ర పరిధిలోకి క్రీడలు: రాజ్‌వర్ధన్‌

న్యూఢిల్లీ,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): జాతీయ క్రీడా విశ్వవిద్యాలయ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. స్పోర్ట్స్‌ యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా క్రీడా మంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌ మాట్లాడారు. అంతర్జాతీయ క్రీడాకారుడిని స్పోర్ట్స్‌ వర్సిటీకి ఛాన్సలర్‌గా నియమిస్తామన్నారు. వర్సిటీ సభ్యుల్లో ప్లేయర్లు కూడా ఉంటారన్నారు. క్రీడలు రాష్ట్రం పరిధిలోకి వస్తాయని, గతంలో యూపీఏ ప్రభుత్వం స్పోర్ట్స్‌ కోడ్‌ను తీసుకువచ్చిందని, కానీ రాష్ట్రాలు ఆ నియమావళిని అమలు చేయడం లేదన్నారు. సాధారణంగా వర్సిటీలు క్రీడా పోటీలను నిర్వహిస్తుంటాయని, అయితే ఆ వర్సిటీలు క్రీడాస్ఫూర్తిని పెంపొందించే పక్రియను అలవరుచు కోవాలని మంత్రి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రీడలు.. 80 బిలియన్ల డాలర్ల పరిశ్రమగా మారిందన్నారు. ఇలాంటి సందర్భాల్లో క్రీడలపై శ్రద్ధ చూపాలన్నారు. రీసర్చ్‌, అడ్మినిస్టేష్రన్‌, అంపైరింగ్‌, ట్రైనింగ్‌ లాంటి అనేక అంశాలపై స్పోర్ట్స్‌ యూనివర్సిటీ దృష్టి పెడుతుందని మంత్రి రాజ్యవర్థన్‌ తెలిపారు. ఆస్టేల్రియాకు చెందిన కాన్‌బెరా వర్సిటీతో ఒప్పందం కుదుర్చుకున్నామని, మణిపూర్‌లో క్రీడా వర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి చెప్పారు. భారతదేశంలో క్రీడల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని టీఆర్‌ఎస్‌ లోక్‌ సభాపక్ష నేత జితేందర్‌ రెడ్డి కోరారు. గ్రామాల్లో క్రీడల అభివృద్ధికి కేంద్రం ఏ చర్యలు తీసుకుంటోందని ప్రశ్నించారు. 130 కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశానికి ఒలింపిక్స్‌ లో కేవలం రెండు పతకాలు మాత్రమే రావడం సిగ్గుచేటు అన్నారు. స్పోర్ట్స్‌ బిల్లుపై లోక్‌ సభలో జరిగిన చర్చలో జితేందర్‌ రెడ్డి మాట్లాడారు. క్రీడల అభివృద్దికి చర్యలు తీసుకోవాల్సి ఉందని, నిధులు పెంచాల్సి ఉందన్నారు.