జానపద కళా ప్రదర్శన

యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి.
స్వాతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా భువనగిరి నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన జానపద కళా ప్రదర్శన కు ముఖ్య అతిథిగా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే ఇప్పుడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర భారత దేశమని ,ఇది సత్యాగ్రహం ద్వారా సాధించుకున్నామని ఇంకా కొంతమంది ప్రజలు వెనుకబాటుకు గురి అవుతున్నారని, దీని అధిగమించడానికి చదువు ఒక్కటే మార్గం అని ఆయన అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అన్ని పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని , ఈ రోజు నిర్వహించిన కళా ప్రదర్శన చాలా బాగుందని ఇటువంటి కళా ప్రదర్శనలు చూస్తూ ఉండాలని వీరు నిర్వహించిన కళా ప్రదర్శనలో అన్ని సమస్యల పరిష్కారం పై ప్రదర్శన జానపద రూపంలో చేయడం ఇది సామాన్య ప్రజలకు కూడా అర్థం అవుతోందని ఆయన అన్నారు.
స్థానిక మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8 నుండి 21 వరకు స్వాతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వహిస్తుందని ప్రతి రోజు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వీటిలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారని , ఈ రోజు నిర్వహించిన జానపద కళా ప్రదర్శన మెచుకొదగిందని ఆయన కళా కారులను కొనియాడారు.వైస్ చైర్మన్ కిష్టయ్య మాట్లాడుతూ ప్రతి కార్యక్రమం ప్రజల భాగస్వామ్యంతోనే విజయవంతం అవుతుందని , ఈ సందర్భంగా ఆయన కొన్ని దేశ భక్తి పాటలను పాడి కళాకారులను, కార్యక్రమానికి హాజరైన వారిని ఉత్సాహ పరిచారు.మున్సిపల్ కమీషనర్ నాగి రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 8 నుండి 21 వరకు స్వాతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ప్రిన్స్ కార్నర్ వద్ద జానపద కళాకారుల ప్రదర్శనను జిల్లా పౌర సంబంధాల అధికారితో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి యం. డి.ఖాజామైనుద్దిన్ వార్డు కౌన్సిలర్ లు, అజిముద్దిన్, స్వామి, డీపీఆర్ఓ సిబ్బంది టి.సంజీవ రెడ్డి, మున్సిపల్ కార్యాలయం సిబ్బంది, టీ ఎస్ ఎస్ కళాకారుల బృందం పాల్గొన్నారు.