జిఎస్టీ సాహసోపేత నిర్ణయం

చెన్నై సదస్సులో నిర్మలా సీతరామన్‌

చెన్నై,జనవరి23(జ‌నంసాక్షి): ఎన్డీయే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) దేశ వ్యవస్థలోనే అతిపెద్ద సంస్కరణ అని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. దీంతో ఏకీకృత పన్నలు విధానం అమల్లోకి వచ్చిందని అన్నారు. తమిళనాడు రాజధాని చెన్నైలో జరుగుతున్న ‘గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ విూట్‌(జీఐఎం)’ సదస్సుకు నిర్మలా సీతారామన్‌ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఎంతో ధైర్యంగా ఈ కీలక సంస్కరణలను అమల్లోకి తెస్తోందని చెప్పారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడే భారత వృద్ధి, సామర్థ్యాలను ప్రపంచ దేశాలను గుర్తిస్తాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అంటుంటారని ఆమె గుర్తుచేశారు. ‘దేశ వృద్ధిరేటు 6.5 శాతానికి మించి ఉంటుంది. ఎన్డీయే హయాంలో కొన్ని సార్లు జీడీపీ 7 శాతాన్ని కూడా తాకింది. భవిష్యత్‌లో ఇది 7 శాతాన్ని దాటి నమోదవుతుందని ఐఎంఎఫ్‌ కూడా అంచనా వేస్తోంది. ప్రధాని మోదీ తీసుకుంటున్న వ్యవస్థీకృత సంస్కరణల వల్లే ఇది సాధ్యమవుతోంది. గత 60 ఏళ్లలో జీఎస్‌టీనే అతిపెద్ద సంస్కరణ’ అని నిర్మలా సీతారామన్‌ చెప్పుకొచ్చారు. ఇలా ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాలతో వ్యాపార అనుకూల దేశాల్లో భారత్‌ తన స్థానాన్ని మెరుగు పరుచుకుందని నిర్మలా సీతారామన్‌ తెలిపారు.