జిల్లాలో జోరుగా హరితహారం
ప్రభుత్వ శాఖలకు లక్ష్యాల నిర్దేశం
జనగామ,ఆగస్ట్5(జనంసాక్షి): జిల్లాలో అడవుల శాతం పెంచి కరువును తరిమికొట్టేందుకు జిల్లా యంత్రాంగం ముందుకు సాగుతున్నది. పండ్ల మొక్కలు, గృహాల్లో పెంచుకునే మొక్కలు, రోడ్లు, కాలువలు, చెరువుల పక్కన నాటే మొక్కలు, రైతులు పొలాల్లో నాటుకునేందుకు టేకు. ఎర్రచందనం, వెదురు, సిల్వర్‌ఓక్, ఈత, కానుగ, ఫెల్టోఫామ్, గుల్‌మహర్, రేల, రెయిన్‌ట్రీ, నిమ్మ , జామ, మునగ, కరివేపాకు, వేప, రావి, అల్లనేరడు, మర్రి సహా ఉద్యానశాఖ ద్వారా 12 లక్షల పండ్ల మొక్కలు నాటుతున్నారు. జిల్లా వ్యాప్తంగా వరుసగా కురుస్తున్న మోస్తరు వర్షాలతో ఐదో విడత హరితహారం
కార్యక్రమం ఊపందుకున్నది. జిల్లా యంత్రాంగం మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇప్పటికే ప్రతీ గ్రామానికి ఐదు వేల చొప్పున మొక్కలు సరఫరా చేసి అధికారులు గుంతలు తీసి వాటిని నాటించి రక్షణ కోసం ముళ్లకంచెలు ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఇంటి ఆవరణలో ఒక్కొక్కరు ఆరు మొక్కల చొప్పున నాటేందుకు రంగం సిద్ధమైంది. ఈ విడత జిల్లాలో కోటిన్నర మొక్కలు నాటే లక్ష్యంతో నర్సరీల్లో మొక్కలు పెంచి ప్రభుత్వ శాఖల వారీగా లక్ష్యాలను నిర్దేశించారు. ప్రధానంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను ఆయా గ్రామాల సర్పంచులకు అప్పగించడంతో మహిళా, యువజన, స్వచ్ఛంద సంస్థలు, వివిధ సంఘాల సహకారంతో విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో జిల్లాలోని 27 ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, ఉద్యోగుల భాగస్వామ్యంతో గ్రామానికి ఐదు వేల మొక్కలు నాటే మెగా హరిత ప్లాంటేషన్ నిర్దేశిరచారు. లక్ష్యాలకు అనుగుణంగా గ్రామాల వారీగా అధికారులు, సిబ్బందిని కేటాయించగా ఉదయం నుంచే ఎంపిక చేసిన ప్రాంతాల్లో గుంతలు తీసి మొక్కలు సిద్ధం చేసుకొని ఒకేసారి నాటారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఖాళీ స్థలాలలో అన్ని రకాల మొక్కలు, వ్యవసాయ పొలం గట్ల వెంట టేకు మొక్కలు నాటారు.