జిల్లాలో టీడీపీ పుంజుకునేనా?

ఆదిలాబాద్‌, నవంబర్‌ 17  జిల్లాలో కంచుకోటగా ఉన్న తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఉద్యమం కారణంగా బలహీనపడింది. ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు టీిఆర్‌ఎస్‌లోకి వలస వెళ్లడంతో పార్టీకి బలం తగ్గింది. ఈ సమయంలో జిల్లా పార్టీ అధ్యక్ష పదవి చేపట్టిన బోథ్‌ ఎమ్మెల్యే నగేష్‌ పార్టీని మళ్లీ ఏ మేరకు బలోపేతం చేస్తారనే అంశంపై కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఎంపీ, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవులతో పాటు అన్ని ఎన్నికల్లో తెలుగుదేశం విజయం సాధిస్తూ వచ్చింది. 2004లో అధికారం కోల్పోయినప్పటికీ పార్టీ బలంగా ఉంటూ వచ్చింది. తెలంగాణ ఉద్యమం ఉధృతం అయిన నేపథ్యంలో ప్రత్యేక రాష్ట్ర విషయమై ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో అనేక మంది టీఆర్‌ఎస్‌లోకి వెళ్లారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర విషయమై ఇప్పటి చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో కార్యకర్తల్లో అసంతృప్తి నెలకొంది. రానున్న సాధారణ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని విజయపంతలో నడిపే బాధ్యత నగేష్‌పై ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో గ్రూపులు నెలకొనడం, కార్యకర్తల్లో సమన్వయం లోపించడం, తెలంగాణ ఉద్యమం తదితర అంశాలు పార్టీ అధ్యక్షుని ముందున్నాయి. అందరినీ కలుపుకొని, కార్యకర్తలను సమన్వయం పరిచి, పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లె విషయమై కార్యకర్తల్లో సంశయం నెలకొంది. ప్రధానంగా ప్రజల్లో, కార్యకర్తల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయమై స్పష్టమైన ప్రకటన చేస్తే తప్ప, పార్టీకి పూర్వ వైభవం రాదని అభిప్రాయాలు పార్టీలో నెలకొన్నాయి. ఈ అంశాలను నూతన అధ్యక్షుడు ఏ విధంగా ఛేదించి పార్టీని ఏలా ముందుకు తీసుకువెళ్లుతారోనని పార్టీ శ్రేణుల్లో నెలకొంది.