జిల్లాలో తెలంగాణవాదుల అరెస్టుల పరంపరాలు
ఆదిలాబాద్, జూలై 23 : సిరిసిల్లలో విజయమ్మ చేస్తున్న దీక్ష సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లావ్యాప్తంగా టీఆర్‌ఎస్ నాయకులను, ముఖ్య కార్యకర్తలను అరెస్టులు చేశారు. సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దీక్షను పురస్కరించుకుని ముందు జాగ్రత్త చర్యలో భాగంగా అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు శ్రీహరిరావు, చెన్నూరు ఎమ్మెల్యే ఓదేలును అరెస్టు చేసి వారి వారి గృహాల్లో నిబర్బందించారు. చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు సిరిసిల్లలో విజయమ్మ దీక్షను అడ్డుకునేందుకు జిల్లా నుండి నాయకులు గాని, కార్యకర్తలు వెళ్లకుండా ఆదివారం నుండే చాలా మందిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతోపాటు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. జిల్లాలో అనేక మంది కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోవడమేకాకుండా జిల్లా సరిహద్దులలో వాహనాల తనిఖీలను ముమ్మరంగా చేపట్టారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలయజేసే హక్కు ప్రజలకు, నాయకులు పూర్తి హక్కు ఉందని ఇందుకు విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యహరిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించి భారీగా పోలీసులను మోహరించిందని చెన్నూరు ఎమ్మెల్యే ఓబేలు ఆరోపించారు. టీఆర్‌ఎస్ హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో పోలీసులు చోరబడి లాఠీ చార్జి చేయడమేకాకుండా నాయకులను అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. వీటిపై పూర్తి విచారణ జరిపి ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా విజయమ్మ దీక్షను ఖండిస్తూ జిల్లావ్యాప్తంగా తెలంగాణవాదులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర విషయమై వైఎస్సార్ కాంగ్రెస్ తమ వైఖరిని వెల్లడించాలని వారు డిమాండ్ చేశారు.