జిల్లాలో నామ మాత్రంగా కొనసాగిన ‘రాత్రి బస’

ఆదిలాబాద్‌, జూలై 29 : వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునే విధంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేపట్టిన రాత్రి బస అనే కార్యక్రమం జిల్లాలో నామ మాత్రంగా కొనసాగింది. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలించి వాటి పరిష్కారానికి మార్గలు చూపాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాల్లో ఒక రోజు రాత్రి బస కార్యక్రమం జిల్లాలో ప్రహసనంగా సాగింది. ప్రభుత్వం మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించడం జరిగింది. అన్ని మండలాల్లోని వసతి గృహాలను సందర్శించి రాత్రి అక్కడే బస చేయాలని జిల్లా శాఖ అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు వసతి గృహాలను పరిశీలించి మిను ప్రకారం విద్యార్థులకు భోజనం అందుతుందా లేదా, స్నానపు గదులు, పారిశుద్ధ్యం, విద్యార్థుల ఆరోగ్యం తదితర అంశాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదికలు పంపించాల్సి ఉంటుంది. ఈ నివేదిక ప్రకారం వసతి గృహాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక నిధులను ప్రభుత్వం మంజూరు చేయనుంది. అయితే ఈ కార్యక్రమం జిల్లాలో సగం మంది ప్రత్యేక అధికారులు డుమ్మా కొట్టగా, మరికొందరు నామ మాత్రంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నో వసతి గృహాల్లో విద్యార్థులు సమస్యలతో సతమతమవుతున్నారు. అనేక వసతి గృహాల్లో విద్యార్థులకు సరైన భోజనం లభించడం లేదు. ఆయా వసతి గృహాల్లో స్థానికంగా ఉండకపోగా ఇష్టాను సారంగా వ్యవహరించడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ రాత్రి బస కార్యక్రమం నామ మాత్రంగా సాగడంతో ప్రభుత్వానికి సమస్యలపై ఎలా నివేదికలు ఇస్తారని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతోంది.