జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

కరీంనగర్‌,ఏప్రిల్‌15

జిల్లాలో ఎండవేడిమి, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. రానున్న నాలుగైదురోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగి గరిష్ఠంగా 45-46 డిగ్రీల సెల్సియస్‌ వరకు చేరుకోగలదని వాతావరణశాఖ అధికారులు అంటున్నారు.  కనిష్ఠంగా 27-30 డిగ్రీల సెల్సియస్‌ వద్ద నమోదవుతాయని జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనస్థానం సాంకేతిక అధికారి పి.మధుకర్‌రావు తెలిపారు. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండి వర్షసూచన లేదన్నారు. గాలిలో తేమ శాతం తక్కువ  నమోదవుతుందని వివరించారు. దీనివల్లనే ఉక్కపోతలు పెరిగాయన్నారు. ప్రజలు అవసరమైతే తప్ప తగు రక్షణ చర్యలతో బయటకు వెల్లాలన్నారు. ఇదిలావుంటే వడదెబ్బ మరణాలు ఆందోలన కలిగిస్తున్నాయి. జిల్లాలో వడదెబ్బతో గురువారం తొమ్మిది మంది మృతిచెందారు. రామగుండంలోని టెంపుల్‌ ఏరియాకు చెందిన నల్లాని వెంకటయ్య (66), సారంగాపూర్‌ మండలం బీర్‌పూర్‌లో కస్తూరి నారాయణ(70), రాయికల్‌ పట్టణంలోని బట్టివాడకు చెందిన అయిన లక్ష్మినారాయణ (65), చొప్పదండి మండలంలోని ఆర్నకొండకు చెందిన మాసం అంజయ్య(68), వెల్గటూరు మండలం ఎండపల్లికి చెందిన కనుకట్ల లక్ష్మీరాజం (40), ధర్మారం మండలం నందిమేడారానికి చెందిన పశువుల కాపరి కొమ్మ పర్వతాల మల్లయ్య (55), జాడి చంద్రయ్య (65) ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్‌కు చెందిన సాద రోశాలు (45), ఓదెల మండల కేంద్రంలో విశ్రాంత రైల్వే ఉద్యోగి పోశవేని రాజయ్య (78) వడదెబ్బతో మృతిచెందారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలిన వైద్యులు సూచిస్తున్నారు.

వాణిజ్య బ్యాంకులకు దీటుగా సహకార బ్యాంక్‌ సేవలు

కరీంనగర్‌,ఏప్రిల్‌15(ఆర్‌ఎన్‌ఎ): జిల్లాలో సహకార కేంద్ర బ్యాంక్‌ వాణిజ్య బ్యాంక్‌కు దీటుగా సేవలు అందిస్తోందని టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు పేర్కొన్నారు. సహకార బ్యాంకును మరింతగా బలోపేతం చేస్తామన్నారు. బ్యాంక్‌ సేవలను కలెక్టర్‌ కూడా ప్రశంసించారని అన్నారు. ముస్తాబాద్‌ మండలం తుర్కపల్లి, ఆవునూర్‌ పోతుగల్‌లో వరి ధ్యానం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు పండించిన వరి ధాన్యం దళారులకు విక్రయించి నష్టపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రంలోనే విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. జిల్లాలో అవసరమైన చోట్ల వీటిని మరిన్ని ప్రారంభింస్తామన్నారు. ఆవునూర్‌ గ్రామం ఎగువ మానేరు(నర్మాల) ప్రాజెక్ట్‌, పెద్దవాగు సరిహద్దులో ఇక్కడి రైతులు ముందస్తుగా వరినాట్లు వేయగా, పంట తొందరగా చేతికొచ్చిందని చెప్పారు. ఈ క్రమంలో రైతులు నష్టపోకుండా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. జిల్లా అధికారులతో మాట్లాడి ముందస్తుగా ముస్తాబాద్‌ మండలం పోతుగల్‌ సహకార సంఘంలోని మూడు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలకు అనుమతిచ్చారని పేర్కొన్నారు.తెలంగాణ రాష్టాన్న్రి దేశంలోనే విత్తనోత్పత్తి బాండాగారంగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్నారని అన్నారు. ఆవునూర్‌లో అందరి సహకారంతో సుమారు కోటిన్నర వ్యయంతో విత్తణోత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. రిబేటు కోసం సంఘాలు, రైతులు విన్నపాలు చేసినా గత పాలకులు పట్టించుకొలేదన్నారు. ముఖ్యమంత్రికి విషయంపై పూర్తి అవగాహన ఉన్నందున రైతులకు లాభం చేకూర్చేందుకు మూలధనంపై ఆరు శాతం రిబేటు ప్రకటించారన్నారు. ఈ మేరకు సంఘాల పక్షాన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.  పోతుగల్‌ సహకార సంఘంలో ఏటీఎం ఏర్పాటు చేస్తామని తెలిపారు