జిల్లాలో భరోసా యాత్ర విజయవంతం
ఆదిలాబాద్, డిసెంబర్ 1 : తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఎమ్మెల్యే, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డ్డి చేపట్టిన తెలంగాణ భరోసా యాత్ర జిల్లాలో విజయవంతమైంది. రెండు రోజుల పాటు చేపట్టిన ఈ యాత్రలో ఉద్యోగ సంఘాలు, ఐకాస నేతలు, విద్యార్థి సంఘాలతో పాటు బిజెపి, టిఆర్‌ఎస్ పార్టీలు మద్దతు ప్రకటించడంతో పాటు ఈ యాత్రలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ యాత్రలో భాగంగా శనివారం నాడు మంచిర్యాలలో జరిగిన యాత్రలో నాగం జనార్దన్‌రెడ్డితో పాటు ముథోల్ ఎమ్మెల్యే వేణుగోపాలచారితో పాటు బిజెపి, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగం జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 9వ తేదీలోగా అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ విషయమై తమ నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ రాజకీయ పబ్బం గడుపుతున్నారని ఆయన ఆరోపించారు. ఆయా పార్టీలు తమ నిర్ణయాన్ని ప్రజలకు తెలియజేయకపోతే మలి విడత యాత్ర ప్రారంభించి వారి నిజ స్వరూపాలు ప్రజలకు తెలియజేస్తామన్నారు. విద్యార్థులు ఆత్మహ్యతలకు పాల్పడకుండా ఉద్యమంలో పాల్గొని ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.