జిల్లాలో భారీగా ‘జీరో’ దందా!
ఆదిలాబాద్, నవంబర్ 24 : అధికారుల అలసత్వం వల్ల జిల్లాలో పెద్ద ఎత్తున జీరో వ్యాపారం జరుగుతూ, ప్రభుత్వానికి పన్నుల రూపంలో రావాల్సిన సొమ్ము రాకుండా పోతోంది. ఆదిలాబాద్ జిల్లా ఆనుకొని మహారాష్ట్ర ఉండడం వల్ల ఆ ప్రాంతం నుంచి సరుకులు, సిమెంటు, ఇనుము, పత్తి తదితర వస్తువులు అక్రమంగా రవాణా చేసుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఆదిలాబాద్ సరిహద్దులో చెక్‌పోస్టులు ఉన్నప్పటికీ అని నామ మాత్రంగా పనిచేస్తూ సిబ్బంది, అధికారులు అవినీతికి పాల్పడుతుండడంతో ప్రభుత్వానికి పన్నుల రూపంలో రావాల్సిన ఆదాయానికి గండిపడుతోంది. పత్తి పంటకు రాష్ట్రంలోని జిల్లాకు పేరు ఉండడంతో పాటు వందలాది కోట్ల రూపాయల వ్యాపారం కొనసాగుతుంది. అక్ట్టోబర్ మాసం నుంచి పత్తి కొనుగోలు ప్రారంభమై, మే వరకు కొనసాగుతోంది. సుమారు 8నెలల పాటు జరిగే పత్తి కొనుగోళ్లలో వ్యాపారస్తులు జీరో వ్యాపారం కొనసాగిస్తూ మార్కెట్ సెస్, వాణిజ్య పన్నులు, ఇతర పన్నులను ఎగరవేస్తున్నారు. కోట్లది రూపాయల వ్యాపారం జరుగుతున్నప్పటికీ నామ మాత్రంగానే వ్యాపారాన్ని చూపుతు మిగతా వ్యాపారాన్ని జీరోగా మారుస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున వ్యాపార లావాదేవీలు జరుగుతున్న జిల్లా యంత్రాంగం కానీ, మార్కెట్ కమిటీ, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతునప్పటికీ ఉన్నతాధికారులు కలగజేసుకోకపోవడం అందరినీ విస్మయ పరుస్తోంది. జిల్లాలో లక్షలాది క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేస్తున్న వాటిని లెక్కల్లో చూపకుండ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడడం వల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రావడం లేదు.