జిల్లా కాంగ్రెస్‌లో తెలంగాణ వేడి
కరీంనగర్ ,నవంబర్ 21: జిల్లా కాంగ్రెస్‌లో తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. ఇక తామే తెలంగాణ కోసం పోరాడాలన్న ఆకాంక్ష వ్యక్తమయ్యింది. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ప్రదానంగా తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారు.పార్టీ సమావేశానికి హాజరైన నేతలందరూ తెలంగాణవాదాన్ని బలంగా వినిపించారు. ఎమ్మెస్సార్, విప్, ఎంపీలతో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి సహా ప్రతీ ఒక్కరు కూడా తెలంగాణ అంశాన్ని కేంద్రం త్వరగా తేల్చాలంటూ డిమాండ్ చేసారు. తెలంగాణ అంశాన్ని తేల్చాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఎంపీలు తమవంతుగా ఉద్యమిస్తున్నారన్నారు. తెలంగాణను ప్రకటించకపోతే తీవ్ర పరిణామాలు చవిచూడక తప్పదని హెచ్చరించారు. డిసెంబర్ 9 ప్రకటనను అమలుపరిచేలా చూడాలని కోరారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ప్రతి ఒక్కరూ బలంగా కోరుకుంటున్నారని మాజీమంత్రి జీవన్ రెడ్డి అన్నారు. వారి ఆకాంక్షలను నెరవేర్చే దిశగా పార్టీ నాయక త్వం కార్యక్రమాలు రూపొందించుకోవాలని సూచించారు. తెలంగాణను సాధించుకోవల్సిన సమయం ఆసన్నమైందని, ప్రజల ఆకాంక్షల మేరకు పోరాడాలని సూచించారు. ప్రజల అభీష్టం మేరకు తెలంగాణపై త్వరలోనే నిర్ణయం తీసుకునేలా అధిష్టానవర్గానికి చెప్పాలని డీసీసీ అధ్యక్షునికి సూచించారు. తెలంగాణ అంశంపై డీసీసీ సమావేశంలో తీర్మానం చేసి పార్టీ నాయకత్వానికి పంపించాలని ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్ సూచించారు. తెలంగాణ కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులందరూ కృషి చేసినా ఇప్పటి వరకు అధిష్టానం నుంచి ఎటువంటి స్పందన రాలేదన్నారు. కాంగ్రెస్ సభ్యత్వ నమోదును కొనసాగిస్తూనే తెలంగాణ కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. జిల్లాలో పార్టీని పటిష్టం చేసేందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. సీనియర్లుగా తామందరం ఇప్పటికే సోనియాగాంధీ దృష్టికి తీసుకువెళ్లామని గుర్తు చేశారు. పార్లమెంట్‌లో తెలంగాణ కోసం ఎంపీలు చేస్తున్న ఉద్యమం అభినందనీయమని కితాబునిచ్చారు. అవసరమైతే పదవులను కూడా త్యాగం చేసేందుకు వారు సిద్ధమే అయినా పదవులు ఉంచుకొని తమలాంటి వారందరినీ ఢిల్లీకి తీసుకువెళ్లాలని ఎంపీలకు సూచించారు.2009 డిసెంబర్ 9న చిదంబరం ప్రకటనకు సోనియా గాంధీయే కారణమని, అయితే సీమాంధ్ర నేతల అభ్యంతరాల వల్లే ప్రకటన వెనక్కి తీసుకునేలా చేశారని ఎమ్మెస్సార్ అన్నారు. ఇందిరాగాంధీ హయాంలో కూడా ఎంపీలుగా గెలిచిన తాము తెలంగాణ కోసం కోరితే సానుకూలంగా స్పందించినా తొందరపడవద్దని, ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని హావిూ ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణపై సోనియా కూడా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారనే నమ్మకం తనకు ఉందని అన్నారు. అప్పటివరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలతో మమేకమై తెలంగాణ కోసం అధిష్టానాన్ని ఒప్పించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.