జిల్లా కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు
ఆదిలాబాద్, నవంబర్ 29 : జిల్లా కాంగ్రెస్ పార్టీలో మరో సారి విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షపదవిని కైవసం చేసుకోవడానికి పార్టీలోని రెండు వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీలో ఇది వరకే జిల్లా వ్యాప్తంగా మూడు వర్గాలుగా విడిపోవడంతో కార్యకర్తల్లో నాయకుల్లో అయోమయం నెలకొంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎంపి ఇంద్రకరణ్‌రెడ్డి రాజీనామా చేయడంతో నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు రెండు వర్గాలుగా విడిపోయారు. జిల్లాలోని తూర్పు ప్రాంతంలో ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు బలం పెంచుకుంటూనే ఇతర ప్రాంతాలలో నాయకులను ఒక వర్గంగా తయారు చేయడంతో నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లా రాజకీయాల్లో ఎమ్మెల్సీ కలగజేసుకోవడమేకాకుండా నామినేటెడ్ పదవులలో తమ అనుచరులకు పదవులు ఇప్పిస్తుండటంతో మహేశ్వర్‌రెడ్డి వర్గంలో ఆందోళన ప్రారంభమైంది. అధిష్టానం పార్టీ అధ్యక్ష పదవికి కొత్త వ్యక్తిని నియమించాలని నిర్ణయించడంతో ఈ పదవిని కైవసం చేసుకోవడానికి రెండు వర్గాలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. తమకు అనుకూలమైన వ్యక్తిని జిల్లా అధ్యక్షునిగా ఎంపిక చేసుకోవడానికి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తుండటంతో కాంగ్రెస్ అధిష్టానానికి సవాల్‌గా మారింది. ఒకరుపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటూ పార్టీని బలహీనంగా మారుస్తున్నారని కార్యకర్తలు, నాయకులు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. మరోపక్క ఎమ్మెల్సీ జోక్యాన్ని కట్టడి చేసేందుకు ఎమ్మెల్యే వర్గం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా అధ్యక్ష పదవికి మంచి నాయకున్ని ఎంపిక చేయాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రితో అతి సన్నిహితంగా ఉంటున్న ప్రేమ్ సాగర్‌రావు తాను సూచించిన వ్యక్తికే అధ్యక్ష పదవిని కట్టబెట్టాలని విజ్ఞప్తి చేశారు. అధ్యక్ష పదవి ఎంపికలో రెండు వర్గాల మధ్య విభేదాలు తలెత్తడంతో ఎంపిక విషయమై అధిష్టానం కసరత్తు ప్రారంభించింది. పార్టీని బలోపేతం చేసి అందరినీ కలుపుకునేలా కృషి చేసే వ్యక్తికి అధ్యక్ష పదవిని కట్టబెట్టాలని తటస్థులు కోరుతున్నారు.