జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షపదవికి గిరిజనుడిని ఎంపిక చేయాలి

ఆదిలాబాద్‌, నవంబర్‌ 29 : జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి గిరిజనుడిని ఎంపిక చేయాలని కాంగ్రెస్‌ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షునిగా గిరిజనుడిని ఎన్నుకోవడంతో కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి కూడా గిరిజనుడిని ఎన్నుకోవాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రంలో గిరిజనులకు ఏ ఒక్క జిల్లాను కేటాయించకపోవడం, కనీసం ఆదిలాబాద్‌ జిల్లాలైనా గిరిజనుడికి స్థానం కల్పించాలని వారు కోరుతున్నారు. జిల్లాలో గిరిజనులు అధిక సంఖ్యలో ఉన్నందునా ఈ పదవిని గిరిజనులకు అప్పజెప్పితే పార్టీ మరింత బలోపేతం అవుతుందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావుకు విజ్ఞప్తి చేశారు. రానున్న ఎన్నికల్లో పార్టీ గిరిజనులకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న సంకేతాలు వెళతాయని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.