జిల్లా తాగునీటి అవసరాల తరవాతనే ప్రాణహిత: పొన్నం
కరీంనగర్,నవంబర్ 21 ప్రాణహిత నుంచి హైదరాబాద్‌కు తాగునీటిని తరలించే విషయంలో తమకు అభ్యంతరం లేదని కరీంనగర్ ఎంపీ పొన్న ప్రభాకర్ అన్నారు. అయితే జిల్లాలో తాగునీటి అవసరాలు తీర్చిన తర్వాతనే నీటిని తరలించాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం, జిల్లా అభివృద్ధి కోసం పార్టీపరంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాణహిత ద్వారా జిల్లా తాగునీటి అవసరాలను గుర్తించాలన్నారు. తెలంగాణపై తేల్చకపోతే ప్రజల్లోకి వెళ్ళడం కష్టమని అన్నారు. సీఎం,పీసీసీ చీఫ్ సమక్షంలోనే ఈ విషయం ఇప్పటికే స్పష్టం చేశామని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు లేవని, కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు లేవని, ఇటువంటి పరిస్థితుల్లో జిల్లా కాంగ్రెస్‌లో నిర్లిప్తత నెలకొందన్నారు. ఇప్పటికే 800 మంది ప్రాణత్యాగాలు చేసుకున్నారని, కలిసికట్టుగా తెలంగాణ కోసం ఉద్యమించి సాధించుకుందామని వివేక్ పిలుపునిచ్చారు. కార్యకర్తల అభీష్టాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా త్వరలోనే తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలన్నారు.తెలంగాణ ఆకాంక్షకు కరీంనగర్‌లో బీజం పడిందని, ఉద్యమాన్ని ఉధృతం చేయాలన్నారు. గత పొరపాట్లు- జరగకుండా చూడాలని సూచించారు. తెలంగాణ డీసీసీ అధ్యక్షులతో సమావేశమై ఒక తీర్మానాన్ని పీసీసీకి, ఏఐసీసీకి పంపించి ఇక్కడి గుండెచప్పుడు కేంద్రానికి మరోమారు వినిపించాలని కోరారు. తెలంగాణ సమస్య పరిష్కరించలేనంత కొత్తది కాదని, 2009 డిసెంబర్ 9నే ప్రకటన చేశామని, దానిని అమలు చేయకపోతే ప్రజల్లోకి వెళ్లడం ఇబ్బందికరమేనన్నారు. తెలంగాణ కోసం అనేక రకాలుగా యత్నించి చివరకు సస్పెండ్ కూడా అయ్యామన్నారు. తెలంగాణ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు. కరీంనగర్‌లోనే సోనియా గాంధీ తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేశారని, అయితే కొందరు మంత్రులు ఢిల్లీకి వెళ్లగా తెలంగాణకు మంత్రులందరూ ఒప్పుకోవడం లేదంటూ ఇంటలీజెన్సు వర్గాల నుంచి కేంద్రానికి నివేదిక వెళ్లిందన్నారు. జిల్లా కాంగ్రెస్ తమవంతు బాధ్యతగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తీర్మానం చేయాలని కోరారు.