జిల్లా యంత్రాంగానికి ఎదురుదెబ్బ

కరీంనగర్‌,నవంబర్‌22 :ఐఏపీ నిధుల కేటాయింపులో జిల్లా యంత్రాంగానికి ఎదురుదెబ్బ తగిలింది. ఎటువంటి అవకతవకలు జరగలేదని జిల్లా కలెక్టర్‌, ఎస్‌పీ సంయుక్తంగా ప్రకటించినా  హైకోర్టు స్టే ఇచ్చింది. నిధుల విడుదలలో పక్షపాతం జరిగిందన్న విపక్ష ఎమ్మెల్యేలకు హైకోర్టు బాసటగా నిలిచింది.   ఐఏపీ కింద 2012-13 సంవత్సరానికి గాను జిల్లాకు 31.58 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. నక్సల్స్‌ ప్రభావిత మారుమూల, గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐఏపీ నిధుల వినియోగంపై హైకోర్టు  స్టే విధించింది. నాలుగు వారాల పాటు స్టే కొనసాగుతుందని, అప్పటిలోగా సమతుల్యత పాటిస్తూ అన్ని నియోజకవర్గాలకు సముచితం గా నిధులను కేటాయించేలా చూడాలని జిల్లా యంత్రాంగానికి సూచించింది. నిధుల కేటాయింపులో అన్యాయం జరిగిందని టీడీపీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, కొప్పుల ఈశ్వర్‌ హైకోర్టును ఆశ్రయించారు. మంత్రి శ్రీధర్‌బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న మంథని నియోజకవర్గానికి అత్యధికంగా 13.92 కోట్ల రూపాయలను కేటాయించడంతో తక్కువ నిధులు కేటాయించిన నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ధర్మపురిలోని వెల్గటూరు, ధర్మారం మండలాలు నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలైనా కూడా కంటితుడుపుగా 50 లక్షలు కేటాయించడాన్ని నిరసిస్తూ తాము హైకోర్టును ఆశ్రయించామని ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. 2012-13 సంవత్సరానికి గాను జిల్లాకు 31.58 కోట్ల రూపాయలను కేటాయించగా కరీంనగర్‌ అసెంబ్లీని మినహాయించి 12 నియోజకవర్గాలకు మాత్రమే నిధులను కేటాయించారు.  ఇటీవల జరిగిన జిల్లా అభివృద్ధి సవిూక్షా సమావేశంలో కూడా ఐఏపీ నిధుల కేటాయింపుపై చర్చ జరిగింది. ప్రధానంగా మంత్రి నియోజకవర్గానికే అధిక నిధులు కేటాయించడంపై అన్ని రాజకీయ పార్టీల్లోనూ అసంతృప్తి మొదలైంది. కావాలనే రెండవ యేటా కూడా నిధులను తరలించుకుపోతున్నారంటూ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీంతో జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నాల లక్ష్మ య్య, మంత్రి శ్రీధర్‌బాబు, కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ ఇచ్చిన హావిూతో ప్రతిపాదనలను సవరిస్తారని భావించారు. అలాంటిదేవిూ జరగక పోవడంతో హైకోర్టును ఆశ్రయించారు.