జీఎస్‌టీ తగ్గింపు ప్రతికూలాంశమే

– దీనివల్ల ఏటా జీడీపీలో 0.04శాతం నుంచి 0.08శాతం లోటు ఆదాయం ఉంటుంది
– 16.7శాతం వృద్ధి సాధించాలంటే జీఎస్టీ వసూళ్లు ముఖ్య
– రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ వెల్లడి
న్యూఢిల్లీ, జులై30(జ‌నం సాక్షి) : 88 రకాల వస్తువులపై వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ)ను తగ్గిస్తూ ఇటీవల జీఎస్‌టీ మండలి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ తగ్గింపు దేశానికి ప్రతికూలాంశమే అని ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ పేర్కొంది. జీఎస్‌టీ తగ్గింపు దేశ ఆర్థిక స్థిరీకరణపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశాలున్నాయని అభిప్రాయాలు వ్యక్తం చేస్తోంది. జీఎస్‌టీ తగ్గింపు వల్ల ఏటా జీడీపీలో 0.04శాతం నుంచి 0.08శాతం ఆదాయ లోటు ఉంటుందని మా అంచనా వేసింది. ఈ నష్టం తక్కువే అయినప్పటికీ.. ఇలా పన్ను రేట్లలో అస్థిరత్వం ఉండటం దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. దీని వల్ల ప్రభుత్వ ఆదాయంలో అనిశ్చితి ఏర్పడుతుందని, ఫలితంగా ఖర్చుల భారం పడుతుందని మూడీస్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల పన్ను ఆదాయంలో 16.7శాతం వృద్ధి సాధించాలని ప్రభుత్వం బడ్జెట్‌లో లక్ష్యంగా పెట్టుకుందని, ఈ లక్ష్యాన్ని సాధించాలంటే జీఎస్‌టీ వసూళ్లు చాలా ముఖ్యమని పేర్కొంది. అయితే 2017 నవంబరు, 2018 జనవరిలో, తాజా జీఎస్‌టీ తగ్గింపు ప్రభుత్వ ఆదాయంపై ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశాలున్నాయి. ఈ తగ్గింపు ప్రభుత్వ ఆర్థిక ఏకీకరణ ప్రయత్నాలపై ఒత్తిడి తెచ్చే ప్రమాదం ఉందని మూడీస్‌ పేర్కొంది. వినియోగదారుల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని ఇటీవల 88 రకాల నిత్యావసర వస్తువులపై జీఎస్‌టీని తగ్గించిన విషయం తెలిసిందే. హస్త కళల వస్తువులు, వెదురు ఫ్లోరింగ్‌, హ్యాండ్‌బ్యాగ్‌లు, టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్‌మిషన్లు, రాతి వస్తువులు, శానిటరీ నాప్‌కీన్లు, చెప్పులు, వాటర్‌ హీటర్లు, వాటర్‌ కూలర్లు తదితర వస్తువులను ఉన్న శ్లాబుల నుంచి కింది శ్లాబులకు మార్చారు. తాజా పన్ను రాయితీల కారణంగా ప్రభుత్వం రూ.8000-10,000 కోట్ల మేర
ఆదాయాన్ని కోల్పోనుంది.