జీతాల పెంపు కోసం అమెరికాలో టీచర్ల ఆందోళన

వాషింగ్టన్‌,ఆగస్ట్‌28(జ‌నం సాక్షి): అమెరికాలోనూ టీచర్లు ఆందోళన బాట పట్టారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగా వేతన పెంపు జరగాలని డిమాండ్‌ చేస్తూ వేలాదిమంది టీచర్లు అమెరికావ్యాప్తంగా సమ్మెకు దిగుతున్నారు. విద్యా రంగానికి బడ్జెట్‌ కోతలను వారు తీవ్రంగా నిరసిస్తున్నారు. మరోవైపు కార్మిక వర్గంలో కూడా పాలక పక్షం పట్ల ఆగ్రహావేశాలు పెరుగుతున్నాయి. త్వరలో కాంట్రాక్టులు రద్దు అయిపోయి వీధిన పడనున్న కార్మికులు వేలాదిమందిగా వున్నారు. గత వారంలో వాషింగ్టన్‌ రాష్ట్రంలో పలు జిల్లాల్లో సమ్మెలు జరిగాయి. లాస్‌ఏంజెల్స్‌లో దాదాపు 26వేల మంది టీచర్లు సమ్మెకు సిద్దమయ్యారు. నార్త్‌ కరోలినాలో టీచర్లు గత శుక్రవారం సమ్మె చేశారు. అలాస్కా టీచర్లు గత వారాంతంలో ప్రదర్శన నిర్వహించారు. ఇటీవల తుపానుతో తీవ్రంగా నష్టపోయిన ప్యూర్టోరికాలో మూడో వంతు పాఠశాలలను మూసివేయాలన్న ఆలోచనలను వ్యతిరేకిస్తూ వేలాదిమంది టీచర్లు ఈ నెల ప్రారంభంలో సమ్మె చేశారు. కేవలం టీచర్లే కాకుండా పలు రంగాలకు చెందిన కార్మికులు కూడా సమ్మె బాట పట్టారు. యునైటెడ్‌ పార్శిల్‌ సర్వీస్‌, యునైటెడ్‌ స్టేట్స్‌ పోస్టల్‌ సర్వీస్‌, ఉక్కు, టెలికం, నిర్మాణ రంగం ఇతర పరిశ్రమల్లో కార్మికులు ఇప్పటికే సమ్మెతో సహా పలు రకాల నిరసనలకు దిగుతున్నారు.