జీవనకాల గరిష్ఠానికి డీజిల్‌ ధర

– చెన్నైలో అత్యధికంగా లీటరు రూ.81.23
న్యూఢిల్లీ, ఆగస్టు30(జ‌నం సాక్షి) : చమురు ధరలు రోజురోజుకూ భగ్గుమంటున్నాయి. తాజాగా డీజిల్‌ ధర గురువారం జీవన కాల గరిష్ఠానికి చేరింది. దేశంలోని నాలుగు మెట్రో నగరాల్లోనూ డీజిల్‌ ధర జీవన కాల గరిష్ఠానికి చేరింది. ముడి చమురు ధరలు పెరగడంతో పాటు చమురు రవాణాపై విధిస్తున్న ఎక్సైజ్‌ సుంకం కారణంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ధరలు పెంచినట్లు చమురు మార్కెటింగ్‌ సంస్థలు వెల్లడించాయి. బుధవారం కూడా ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. ఆగస్టు 16 నుంచి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి బలహీన పడడమూ ధరల పెరుగుదలపై ప్రభావం చూపుతోంది. గురువారం ఢిల్లీలో లీటరు డీజిల్‌ ధర రూ.69.93పైసలుగా ఉంది. ముంబయిలో లీటర్‌ డీజిల్‌ రూ.74.24, కోల్‌కతాలో రూ.72.78, చెన్నైలో రూ.73.88గా ఉంది. పెట్రోల్‌ ధరలు కూడా పెరిగాయి. దిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.78.30గా ఉంది. ముంబయిలో రూ.85.72, కోల్‌కతాలో రూ.81.23, చెన్నైలో రూ.81.35గా ఉంది. బుధవారం నాడు ఢిల్లీలో లీటర్‌ డీజిల్‌ ధర రూ.69.75గా, లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.78.18గా ఉంది. మే 29న దేశ రాజధానిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.78.43తో జీవనకాల గరిష్ఠానికి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా రోజువారీ ధరల విధానాన్ని ఏడాదిన్నర నుంచి అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
————————–