జీవన ప్రమాణాలు.. పెంచేందుకే జన్మభూమి


– అర్జీదారుల్లో అర్హులందరికీ న్యాయం చేయండి
– ప్రతీ పేదవాడికి సంక్షేమ ఫలాలు అందాలి
– రాష్ట్ర ప్రగతికి రథాలు.. ప్రజలు, ఉద్యోగులే
– ఉద్యోగుల ఇళ్ల నిర్మాణాలకు భూములు గుర్తించండి
– చుక్కల భూమి సమస్యకు పరిష్కారం చూపండి
– అధికారుల టెలీకాన్ఫరెన్స్‌లో ఏపీ సీఎం చంద్రబాబు
అమరావతి, జనవరి5(జ‌నంసాక్షి) : జీవన ప్రమాణాలు పెంచేందుకే జన్మభూమి కార్యక్రమం చేపట్టినట్లు సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం జన్మభూమి నాలుగవ రోజుపై అధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఈ జన్మభూమిలో ఫిర్యాదుల సంఖ్య సగం తగ్గిందన్నారు. ప్రజల భాగస్వామ్యం రెట్టింపు అయిందని తెలిపారు. వైద్య శిబిరాలకు, వెటర్నరీ క్యాంపులకు స్పందన బాగుందని చెప్పారు. ఇది చాలా సానుకూల పరిణామమని, నాలుగున్నరేళ్ల మన
శ్రమ ఫలితం అని అధికారులతో అన్నారు. ప్రతి గ్రామంలో, వార్డులో అభివృద్ధి పనులు చేశామని, ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని చంద్రబాబు తెలిపారు. ఒకవైపు అభివృద్ధి పనులు కళ్ల ముందే ఉన్నాయని, మరోవైపు అర్హులు అందరికీ సంక్షేమం ఇస్తున్నామన్నారు. ప్రజల్లో సంతృప్తే ఫిర్యాదుల సంఖ్య తగ్గడానికి కారణమని చంద్రబాబు అన్నారు. రేషన్‌, పెన్షన్‌, ఇళ్ల కోసం వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీదారుల్లో అర్హులు అందరికీ న్యాయం చేయాలన్నారు. రాష్ట్ర ప్రగతికి రథాలు ప్రజలు, ఉద్యోగులే అని పేర్కొన్నారు. ఉద్యోగుల నేస్తం ఈ రాష్ట్ర ప్రభుత్వమన్నారు. సొంత ఇల్లులేని ప్రతి ఉద్యోగికి గృహ వసతి కల్పిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. రైతుల పండుగ సంక్రాంతి, పంట దిగుబడులు ఇంటికొచ్చే పర్వదినమన్నారు. సంక్రాంతి దినాల్లో జన్మభూమి పండుగలా జరపాలని అధికారులతో చంద్రబాబు తెలిపారు. తీవ్ర ఆర్ధికలోటులోనూ రైతులకు రూ.24వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. ప్రతి రైతుకు రూ.1.50లక్షల ప్రయోజనం చేకూరిందన్నారు. రూ.4వేల కోట్ల ఇన్‌ పుట్‌ సబ్సిడి ఇచ్చామని, రూ.4వేల కోట్ల విలువైన పంట ఉత్పత్తులు కొన్నామన్నారు. కౌలు రైతులకు రూ.9100కోట్ల పంట రుణాలు ఇవ్వడం దేశంలోనే రికార్డని బాబు చెప్పుకొచ్చారు. క్రాప్‌ హాలిడేస్‌, పవర్‌ హాలిడేస్‌ లేకుండా చేశామన్నారు. గతంలో ఎరువులు అడిగితే లాఠీచార్జిలు, పీఎస్‌లలో విత్తనాల పంపిణీ జరిగేదన్నారు. రైతులను అన్నివిధాలా ఆదుకున్నామన్నారు. పెట్టుబడి లేని వ్యవసాయంపై రైతుల్లో అవగాహన పెంచాలని సూచించారు.
చుక్కల భూములను సమస్యలను పరిష్కరించాలి..
చుక్కల భూమి సమస్యలు సత్వరమే పరిష్కరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. చుక్కల భూమి సమస్యలు సత్వరమే పరిష్కరించాలని పునరుద్ఘాటించారు. ఏళ్లుగా రైతులను సతమతం చేస్తున్న ఈ సమస్యకు పరిష్కారం చూపాలని తేల్చిచెప్పారు. భూమిని బదిలీ చేసుకోలేక, అమ్ముకోలేక అనేక మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వమే సుమోటాగా చుక్కల భూముల సమస్యలను పరిష్కరించాలని స్పష్టం చేశారు. ప్రతి రైతు కళ్లల్లో ఆనందం చూడాలని సీఎం అన్నారు.
ఇళ్ల నిర్మాణానికి భూములు గుర్తించండి..
సొంత ఇల్లులేని ప్రతి ఉద్యోగికీ గృహ వసతి కల్పించి వారి సొంతిటి కల నెరవేరుస్తామని చంద్రబాబు స్పష్టంచేశారు. ప్రభుత్వ సేవల ద్వారా ప్రజా సేవచేసే ప్రతి ఉద్యోగికీ సొంత ఇల్లు ఉండాలని ఆయన తేల్చి చెప్పారు. ఉద్యోగుల ఇళ్ల నిర్మాణానికి భూములు గుర్తించాలని అధికారులను ఆదేశించారు. అపార్ట్‌మెంట్లు నిర్మించి అందులో వారికి ప్లాట్లు కేటాయించాలని సూచించారు. రాష్ట్ర ప్రగతికి ప్రజలు, ఉద్యోగులే రథాలు అని ముఖ్యమంత్రి కొనియాడారు. ఇరువర్గాల సంక్షేమమే లక్ష్యంగా అనేకం చేశామని గుర్తుచేశారు. 30, 40 ఏళ్లు హైదరాబాద్‌తో అనుబంధం వదులుకుని ఉద్యోగులు, న్యాయవాదులు ఇక్కడికి వచ్చినందున వారు నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని హావిూ ఇచ్చారు.