జూట్‌మిల్లు వద్ద ఆందోళన

పరిస్థితి ఉద్రిక్తం

గుంటూరుహైదరాబాద్‌,నవంబర్‌22(జ‌నంసాక్షి): జూట్‌ మిల్లు వద్ద గురువారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మూడున్నరేళ్లుగా లాకౌట్‌లో ఉన్న జూట్‌ మిల్లు నుంచి ముడి సరుకు, యంత్రాలను కోర్టు ఉత్తర్వులతో యాజమాన్యం తరలించేందుకు ప్రయత్నించగా కార్మికులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో కూడా రెండు పర్యాయాలు ఇదేవిధంగా యాజమాన్యం మిల్లుకు సంబంధించిన సామగ్రిని తరలించేందుకు ప్రయత్నించగా కార్మికులు అడ్డుగా నిలిచారు. అయితే కోర్టు ఆదేశాల మేరకు ఈ దఫా భారీ పోలీసు బందోబస్తు మధ్య సామగ్రిని తరలించేందుకు యజమాన్యం యత్నించింది. ఈ విషయం తెలుసుకున్న కార్మికులు పెద్దఎత్తున అక్కడికి చేరుకుని తరలింపును అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కార్మికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. జూట్‌ మిల్లు పరిరక్షణ సమితి కన్వీనర్‌ అప్పిరెడ్డికి గాయాలవగా ఆయన్ను వెంటనే ప్రభుత్వాసుత్రికి తరలించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి అజయ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్‌ రావు, కార్మికులను అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు.

సరుకు తరలిస్తున్న లారీలకు కార్మికులు అడ్డుగా నిలవడంతో పోలీసులు వాటిని తిరిగి వెనక్కి పంపారు. ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి అక్కడికి చేరుకుని కార్మికులకు న్యాయం చేసే వరకు సరుకు తరలించవద్దని ఆందోళనకు దిగారు.