జూన్ నెల వేతనాలివ్వాలి
ఆదిలాబాద్, జూలై 19 : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న విద్యావలంటరీలకు జూన్ నెల వేతనాలను విడుదల చేయాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మోసిన్‌ఖాన్ విజ్ఞప్తి చేశారు. ప్రతి నెల 1వ తేదీలోగా వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వం జీవోను విడుదల చేసినా అధికారుల నిర్లక్ష్య కారణంగా విద్యావలంటరీలు సరైన సమయంలో వేతనాలు పొందలేకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జూలై మాసంలోనైన సకాలంలో వేతనాలు చెల్లించేల అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇటీవల జరిపిన ఉపాధ్యాయ బదలీలో ఆయా పాఠశాలలో తీసేసిన విద్యావాలంటరీలను అదే మండలంలో నియమించాలని ఆయన డిమాండ్ చేశారు.