ఆస్టిన్ మార్టిన్.. ఈ బ్రాండ్‌పేరు చెబితే టక్కున జేమ్స్‌బాండ్ సినిమా గుర్తుకు వస్తుంది. ఎవరైనా బాండ్ స్టైల్‌లో ఆస్టిన్ మార్టిన్ వాడాలని కోరుకుంటారు. కానీ కొందరు సంపన్నులకు మాత్రమే ఈ కోరిక తీరుతుంది. ఎందుకంటారా..? ఈ కారుకొనాలంటే కనీసం ఐదుకోట్ల రూపాయలు పెట్టాలి. ఇప్పడు భారతీయ మార్కెట్లోకి ఆస్టిన్ మార్టిన్ కొత్తకారున తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ సంస్థ ఉత్పత్తి చేసే డీబీ సిరీస్‌లో డీబీ11 మోడల్‌ను భారత్‌లో విడుదల చేయనుంది. ఈ కారు ఎక్స్‌షోరూం ధర భారత్‌లో రూ.4.27కోట్ల ఉండవచ్చు. ముంబయిలో దీనికి బుకింగ్‌లు కూడా ప్రారంభించారు. దీనిని ఇటీవల ముంబయిలో ప్రదర్శనకు కూడా ఉంచారు. దీని డెలివరీలను 2017 ఫిబ్రవరి నుంచి ప్రారంభిస్తారు. హైదరాబాద్‌లో దీనిని ఈ నెల 23, 24 తేదీల్లో ఈ కారును ప్రదర్శించనున్నారు.
బాండ్ సినిమా స్పెక్టర్ కోసం సిద్ధం చేసిన డీబీఎక్స్ కాన్సెప్ట్‌లో ఈ కారును తయారు చేశారు. దీనిలో 5.2లీటర్ ట్విన్ టర్బోఛార్జిడ్ వీ12 ఇంజిన్‌ను వినియోగించారు. ఇది 700 ఎన్‌ఎం టార్క్ వద్ద 600 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. దీనిలో జెడ్‌ఎఫ్8 స్పీడ్ గేర్‌బాక్స్‌ను వాడారు. 0నుంచి 100 కిలోమీటర్ల వేగానికి దాదాపు 3.9సెకన్లలో చేరుకుంటుంది. దీని అత్యధిక వేగం గంటకు 322 కిలోమీటర్లు. ఈ కారులో కూడా ఆస్టిన్ మార్టిన్ సిగ్నేచర్ గ్రిల్‌ను వినియోగించడం విశేషం.