‘జై ఆంధ్ర’ సమయంలో… చార్మినార్‌ సిగరెట్ల బహిష్కరణ

సీమాంధ్ర నేతల దుర్నీతి

ఇక్కడి వ్యాపార సంస్థల కూలదోతకు ప్రయత్నం
వీరా సమైక్య రాష్ట్రం కోరుకునేది?
హైదరాబాద్‌, జనవరి 18 (జనంసాక్షి) :
రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ పదే పదే కళ్లబొల్లి మాటలు చెప్పే సీమాంధ్ర నేతలు, పెట్టుబడిదారుల దుర్మార్గపు విధానాలకు సజీవ సాక్షమిది. వారు చెప్పేదొకటి.. చేసేది మరోకటి అని నిరూపించే ఘటన ఇది. అనేక కుట్రలు, కుతంత్రలు పన్ని తెలంగాణను కలుపుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటుకు స్కెచ్‌ వేసిన ఆంధ్ర దోపిడీదారుల ఒర్పుమల్లె తనానికి పరాకాష్ట ఇది. రాష్ట్రం కలగలసిన 16 యేళ్లలోనే అందికాడికి దోచుకున్న సీమాంధ్ర నేతలు తెలంగాణ ప్రాంత ముఖ్యమంత్రిని గద్దె దించేందుకు 1972 సృష్టించిన జై ఆంధ్ర ఉద్యమ సమయంలో పన్నిన పన్నాగమిది. తెలంగాణను సర్వం దోచుకున్న సీమాంధ్ర నాయకులు, ఇక్కడి వ్యాపార సంస్థల ఆర్థిక వనరులను కొళ్లగొట్టడమే ధ్యేయంగా పనిచేశారు. హైదరాబాద్‌ నుంచి ఉత్పత్తి, మార్కెటింగ్‌ అవుతున్న చార్మినార్‌ సిగరెట్లను ఆంధ్ర ప్రాంతంలో నిషేధించారు. ఇప్పటి సమైక్యాంధ్ర ఉద్యమానికి కేంద్రస్థానంగా చెప్పుకునే విజయవాడ కేంద్రంగానే ఈ దుర్మార్గపు నిషేధం అమల్లోకి వచ్చింది. వీఎస్‌టీ (వజీర్‌ సుల్తాన్‌ టొబాగో కంపెనీస్‌) నుంచి ఉత్పత్తి అవుతున్న చార్మినార్‌ సిగరెట్లను తమ ప్రాంతంలో నిషేధిస్తే ఆ కంపెనీ వ్యాపారం క్షీణించి ఉద్యోగులు రోడ్డున పడతారనే దుర్మార్గపు ఆలోచన వారిది. ఉమ్మడి రాష్ట్రం పేరుతో ఈ ప్రాంతంలో ప్రవేశించి, తెలుగును అధికార భాషగా చేసి హైదరాబాద్‌ సంస్థానంలోని చదువుకున్న వారందరినీ నిరుద్యోగులుగా మార్చిన సీమాంధ్ర నేతలు, ఇక్కడి పేద ప్రజలు కార్మికులుగా ఉన్న చార్మినార్‌ సిగరెట్ల కంపెనీ ఆర్థిక వనరులపై దెబ్బ కొట్టేందుకు దారుణంగా ప్రవర్తించారు. అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పీవీ నర్సింహారావును గద్దె దించేందుకు ప్రారంభమైన ఉద్యమం ఇక్కడి వ్యాపారాలను దివాళా తీయించడం, అప్పటికే నిరుద్యోగులుగా మారిన తెలంగాణ యువతను మరింత నైరాశ్యంలోకి నెట్టడమే లక్ష్యంగా పనిచేశారు. 1972 జనవరి, ఫిబ్రవరి నెలల్లో వీరి దారుణ ప్రవర్తనను అక్కడి విద్యార్థి, సిగరెట్‌ వ్యాపార సంఘాల బాధ్యులు ముక్తకంఠంతో ఖండించారు. వారు జారీ చేసిన ప్రకటనలు అప్పట్లో అన్ని తెలుగు, ఆంగ్ల దినపత్రికల్లో ప్రచురితమయ్యాయి. వారి లక్ష్యం నెరవేరిన తర్వాత కూడా తెలంగాణ ప్రాంత ఉత్పత్తుల కొనుగోలుకు ముందుకు రాలేదు. తెలంగాణ ఉద్యమం ఇంత తీవ్రంగా సాగుతున్నా ఏ ఒక్క రోజూ సీమాంధ్ర ప్రాంత పారిశ్రామిక ఉత్పత్తులను బహిష్కరించలేదు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వ్యాపార సంస్థలనే కాదు విద్యాసంస్థలనూ బ్లాక్‌ లిస్టులో పెట్టలేదు. ఎక్కడైనా దుందుడుకు స్వభావం ఉన్నవారు ఉంటారు. అలాంటి వారు భావోద్వాగాలు ఎక్కువగా ఉన్నప్పుడు కాస్త రెచ్చగొట్టేలా ప్రవర్తించినా వారు సైతం ఆంధ్ర వస్తువులను బహిష్కరించలేదు. అలాంటి రాష్ట్రం మొత్తం సమైక్యంగా ఉండాలని కోరుకునే సీమాంధ్ర పెత్తందారులు కనీసం తెలంగాణ మంగలి కులస్తులు నిర్వహించే సెలూన్లలో షేవింగ్‌ కూడా చేసుకోరు. ఇలాంటి వారు సమైక్యాంధ్ర ఉండాలని కోరుకోవడాన్ని ఏమనాలి. వారు తీరును ఎలా చూడాలి. 1972లో చార్మినార్‌ సిగరెట్లపై నిషేధం ఎత్తివేయాలని కోరుతూ ఆంధ్ర ప్రాంతం వారు చేసిన విజ్ఞప్తిని ఆంధ్ర పత్రిక ఫిబ్రవరి 2న ప్రచురించింది. అలాంటి వారు ఇప్పుడు నీతులు చెబుతున్నారు. తెలంగాణ ఏర్పడితే ఆంధ్ర వ్యాపారులకు, వ్యాపారాలకు ఏవో ఇబ్బందులు తలెత్తుతాయని అనవసర భయాలు సృష్టిస్తున్నారు. హైదరాబాద్‌లో ఒక్క సీమాంధ్ర ప్రాంతం వారే వ్యాపార సంస్థలే లేవు. ఉత్తర, దక్షిణ, ఈశాన్య భారతాల్లోంచి వచ్చిన వారెందరో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వారితో పాటు ఆంధ్ర వ్యాపారులు ఇక్కడ తమ పనులు చేసుకోవచ్చు. సీమాంధ్ర నేతల్లా తెలంగాణ ప్రజలు వారి వస్తువుల నిషేధానికి పూనుకోరు. వినిపోయి అన్నదమ్ముల్లా కలిసి ఉందామని మాత్రమే కోరుకుంటున్నారు.